
పిచికారీతో ప్రాణాలమీదకు..
● మోతాదు మించి రసాయన ఎరువుల వాడకం
● తప్పనిసరైతేనే పిచికారీ చేయాలంటున్న శాస్త్రవేత్తలు
● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
జగిత్యాలఅగ్రికల్చర్: ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రూపొందిస్తుండగా, మరో వైపు ఆ పంటలపై ఆశించే చీడపీడల నుంచి పంటను కాపాడేందుకు రైతులు క్రిమిసంహారక మందులు వాడడం పరిపాటిగా మారింది. ఆయా పంటలకు జరిగే నష్టంలో దాదాపు 20–25 శాతం చీడపీడల వల్లే కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వరిలో కాండంతొలుచు పురుగు నివారణకు రైతులు ఒక్కటికి రెండుసార్లు పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. కాగా, ఇటీవల ఖమ్మం జిల్లాలో పత్తి పంటపై పురుగుమందులు పిచికారీ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం జరిగి కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు.
● అవసరమైతేనే..
పురుగుమందుల వాడకంపై రైతులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. గ్రామాల్లోని ఫెర్టిలైజర్ డీలర్లు, పురుగుమందుల వ్యాపారులు చెప్పే మందులనే పిచికారీ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కో రకంగా ఉండి పిచికారీ చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. ఏ పురుగుకు, యే మోతాదులో, ఏ మందు వాడాలో రైతులకు తెలియని పరిస్థితి. కొన్ని రసాయన మందులు ఘాటైన వాసన కలిగి ఉంటే, మరికొన్ని తేలికగా ఉంటాయి. రైతులు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారీ చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
● పెడచెవిన పెడుతూ..
చాలా మంది రసాయన మందులు పిచికారీ చేసేటప్పుడు బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కా నమలడం, తంబాకు నోట్లో వేసుకోవడం చేస్తుంటారు. అలాగే, మధ్యాహ్న సమయంలో భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో కాకుండా కేవలం నీళ్లతో మీదమీద కడిగి భోజనం చేస్తుంటారు. దీంతో మందు ప్రభావం తమకు తెలియకుండానే వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనిషి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే గాలి ఏ వైపు నుంచి వీస్తుందో గమనించక ఇష్టమొచ్చినట్లు పిచికారీ చేస్తుంటారు. దీంతో రసాయన మందు గాలిలో కలిసి శ్వాస తీసుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి, వాంతులు కావడం, తలతిప్పడం, శరీరమంతా చెమటలు పట్టడం, సరైన శ్వాస అందకపోవడం వంటివి జరుగుతుంటాయి.
● జాగ్రత్తలు పాటించాలి
రైతులు, రైతు కూలీలు పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. స్ప్రేయర్లకు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. మందు నీళ్లు శరీరంపై పడకుండా లూజూ దుస్తులు ధరించాలి. కళ్లకు అద్దాలు ధరించడం మంచిది. పిచికారీ పూర్తయిన తర్వాత తలభాగం నుంచి సబ్బుతో స్నానం చేయాలి. పిచికారీ చేసే వ్యక్తికి ఏవైనా గాయాలుంటే, అవి కనబడకుండా ప్లాస్టర్ వేసుకోవాలి. పిచికారీ సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. మందు ప్రభావం ఎంత గాఢతదో తెలుసుకునేందుకు డబ్బాను వైద్యుడికి చూపించాలి.
● ఎప్పుడు వాడాలంటే..
పురుగుమందులు ఏ సమయంలో వాడాలో చాలా మంది రైతులకు తెలియడం లేదు. ముందుగా సాగు చేసిన పంటను రెండుమూడు రోజులకోసారి పరిశీలించి, ఏ పురుగు వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై అవగాహనకు వచ్చిన తర్వాత మందులు వాడాలి. అవసరమైతే వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటను పరిశీలించిన తర్వాత వారి సిఫారసు మేరకు మందులు పిచికారీ చేయడం మంచిది.
సిఫారసు మేరకు వాడాలి
పురుగుమందులు ఎందుకు వాడుతున్నారో చాలా మంది రైతులకు తెలియడం లేదు. దీంతో ఖర్చు పెరుగుతుందే కానీ పంటల్లో పురుగులు చావడం లేదు. పంటలో ఏదైనా సమస్య వస్తే శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయాధికారుల సూచనల మేరకు నాణ్యమైన సంస్థల పురుగుమందులు పిచికారీ చేయాలి.
– డాక్టర్ హరీశ్‌కుమార్‌శర్మ,
పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస
జాగ్రత్తలు తీసుకోవడం లేదు
పురుగు మందులు పిచి కారీ చేసేటప్పుడు రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మందు గాలిలో కలిసి రైతు శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది. పిచికారీ చేసేటప్పుడు కనీసం మాస్క్ అయినా వాడాలి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
– డాక్టర్ మల్లారెడ్డి, ఎండీ,
ఫిజిషియన్, జగిత్యాల

పిచికారీతో ప్రాణాలమీదకు..

పిచికారీతో ప్రాణాలమీదకు..