
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో ఐదుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్‌ఆలం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంకు చెందిన దినేశ్ రాజ్‌పురోహిత్ ప్రస్తుతం ఆశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ జవహర్‌నగర్‌కు చెందిన కొత్తోజు సందీప్‌చారితో పీడీయాక్టులో చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో ఈనెల ఆరోతేదీన వివేకానందపురికాలనీలోని భార్గవి ఎంక్లేవ్ అపార్ట్‌మెంట్‌లో, వెంకటేశ్వర రెసిడెన్సిలో 32 తులాల బంగారం చోరీ చేశారు. కొంత సొత్తును ఎల్లారెడ్డిగూడలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టారు. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. 265.69 గ్రాముల బంగారం రికవరీ చేసి, కోర్టుకు తరలించారు. దినేశ్ రాజ్ పురోహిత్ 40 కేసుల్లో నిందితుడు. ఖమ్మం, సూర్యాపేట, కోదాడ, విశాఖపట్నం, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, సైబరాబాద్, కరీంనగర్, సిద్దిపేట స్టేషన్లలో కేసులున్నాయి.
మానకొండూర్ కేసులో ముగ్గురు..
మానకొండూర్, లలితాపూర్‌లో జరిగిన చోరీలో నలుగురు నిందితులు ఉండగా, ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన టేకు గంగసాయిలు(55), టేకు భూమయ్య(45) అన్నదమ్ములు. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీ చేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు, గంగాధర, లక్ష్మీదేవిపల్లి, మానకొండూర్, లలితాపూర్, రాజాపూర్‌లో దొంగతనాలు చేశారు. సొత్తును ఉప్పుల వేణు, భార్త ఎక్నాత్ శేల్కేకు విక్రయించారు. పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్టు చేశారు. 59.3 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి, రూ.1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పుల వేణు త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కేసులను ఛేదించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీససీఎస్ ఏసీపీ నరసింహులు, త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై చేరాలు, మానకొండూర్ సీఐ సంజీవ్, సీసీఎస్ సీఐ ప్రకాశ్, ఎస్సై స్వాతి, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
వేర్వేరు కేసుల్లో ఐదుగురి పట్టివేత
325 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి రికవరీ
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం