
అదుపులోకి వచ్చిన మంటలు
మెట్‌పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో మంటలు బుధవారం సాయంత్రం అదుపులోకి వచ్చాయి. ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగగా.. గమనించిన అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అదించారు. వెంటనే ఆ శాఖ సిబ్బంది రెండు ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ క్రమంగా అవి గోదామంతా వ్యాపించడంతో అదుపు చేయడం కష్టమైంది. దీంతో అధికారులు మరికొన్ని ఫైర్ ఇంజిన్లను రప్పించారు. నిరంతరాయంగా సుమారు 80గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాలతో పోలీస్, మున్సిపల్, సివిల్ సప్లయ్, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ అక్కడే ఉండి వారికి అన్ని విధాలుగా సహకారం అందించారు. అగ్నిప్రమాదంతో రూ.1.67లక్షల నష్టం వాటిల్లిందని మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్, అగ్నిమాపక శాఖల విచారణలో ఏం తేలుతుందనేది ఆసక్తిగా మారింది.