పాలకుర్తి: జల్సాలకు అలవాటుపడి చోరీలు చేస్తూ కటకటాలపాలయ్యడు ఓ యువకుడు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ బసంత్‌నగర్ ఠాణాలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన పరకాల అశోక్ తన అమ్మమ్మ ఊరు పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లికి మే 18న ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అదేరోజు రాత్రి దాడి నాగరాజు ఇంటితాళం పగులగొట్టి 2 తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు. గతనెల 20 ఇదే గ్రామానికి చెందిన పెసరి మల్లేశ్.. పెద్దంపేటలోని తన అత్తగారింటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే అశోక్ ఇల్లు ఉంది. దీంతో మల్లేశ్ తన గ్రామంలోనే ఉన్నాడని తెలుసుకుని అదేరోజు రాత్రి ఈసాలతక్కళ్లపల్లికి వెళ్లి మల్లేశ్ ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 3 తులాల బంగారుహారం దొంగిలించాడు. జూలై 26న సుల్తానాబాద్ శాసీ్త్రనగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అశోక్ అభరణాలు ఎక్కడో పోగొట్టుకున్నాడు. అయితే, చోరీ చేసిన బంగారం, వెండి విక్రయించేందుకు వెళ్తున్న అశోక్‌ను బసంత్‌నగర్ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారం, 35 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారాన్ని ఓ ఫైనాన్స్‌లో తనాఖా పెట్టాడని పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై స్వామి పాల్గొన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూసిన సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై స్వామి, హెడ్‌కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు శరత్, అనిల్‌కుమార్, శివకుమార్, శ్రీనివాస్, రవీందర్, అనిల్‌ను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేశారు.
కటకటాలపాలైన యువకుడు
3 తులాల బంగారం, 35 తులాల వెండి స్వాధీనం
పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ వెల్లడి