
వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
వెల్గటూర్: అప్పటివరకూ స్నేహితుడి వివాహ వేడుకలో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఆ యువకులు.. వేడుక ముగించుకొని బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన ముచ్చకుర్తి అనిల్ (26), మేడి గణేశ్ (26) ఇద్దరు స్నేహితులు. ద్విచక్రవాహనంపై ఎండపల్లి మండలకేంద్రంలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రిపూట స్వగ్రామమైన ఇటిక్యాలకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ స్టేజీ వద్ద లక్సెట్టిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. అదే సమయంలో రోడ్డుపైకి ఓ గేదె రావడంతో బస్సు గేదెను ఢీకొంది. బస్సు డ్రైవర్ గేదెను తప్పించేక్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్ ఇటీవలే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్ హైదరాబాద్‌లో వండర్ లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. గణేశ్‌కు సోదరి ఉంది. తల్లిదండ్రులు గ్రామంలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. సోదరికి వివాహమైంది. అనిల్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ముంబయి వలస వెళారు. అనిల్‌కు సోదరుడు ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
మృతుల్లో ఒకరు కానిస్టేబుల్

వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..