‘కూలి’న బతుకులు | Sakshi
Sakshi News home page

‘కూలి’న బతుకులు

Published Wed, May 22 2024 4:15 AM

‘కూలి

మట్టిపెల్లలు కూలి ఒకరు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు

వెంకట్రావుపేటలో విషాదం

సిరిసిల్లటౌన్‌/కోనరావుపేట(వేములవాడ): ఉపాధి కూలీల పాలిట మట్టిపెళ్లలు మృత్యుపెళ్లలయ్యా యి. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట శివారులోని చెరువులో మంగళవారం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలపై మట్టిపెల్లలు పడడంతో ఒకరు చనిపోగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగా త్రుల ఆర్తనాదాలు, మృతురాలి బంధువుల రోదనలతో సిరిసిల్ల ఆస్పత్రి ఘొల్లుమంది.

నీడ కోసం వెళ్తే..

వెంకట్రావుపేటలోని కేశవరావుకుంటలో నాలుగు వారాలుగా ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. మంగళవారం 23 మంది కూలీలు హాజరయ్యారు. మ ట్టిని తవ్వి పొలాలకు తరలిస్తున్నారు. రోజు మాది రిగానే ట్రాక్టర్‌లో మట్టిని నింపిన కూలీలు నీడ కో సం సమీపంలోని కట్టవద్ద చిన్నపాటి బొరియ(సొరంగం)లో కూర్చున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పై నుంచి మట్టిపెల్లలు కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మారుపాక రాజవ్వ(55) మృతి చెందగా.. మరో ఆరుగురు కర్నాల లహరి, కర్నాల శ్యామల, పల్లం దేవవ్వ, ఎడ్ల రామవ్వ, వడ్నాల అమృత, సందు చంద్రయ్య గాయపడ్డారు. వీరిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. కర్నాల లహరి కాలు విరిగింది. ఆమె అత్త కర్నాల శ్యామల నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. పనిస్థలంలో నీడ సౌకర్యం కల్పించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కూలీలు ఆరోపిస్తున్నారు.

చిన్నప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి

మారుపాక రాజవ్వ–రాములు దంపతులు కొన్నేళ్ల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటనుంచి వెంకట్రావుపేటకు వలస వచ్చారు. భర్త రాములు కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా రాజవ్వ ఇద్దరు కుమారులు బాలకిషన్‌, సాయి, కూతురు సరితను పెంచి పెద్దచేసింది. సరితకు వివాహం కాగా పెద్ద కుమారుడు బాలకిషన్‌ కానిస్టేబుల్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండో కుమారుడు సాయి ఏడాది క్రితం గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. తండ్రి చిన్నప్పుడే మృతిచెందగా.. అన్నీ తానై పెంచి పెద్దచేసిన తల్లి నేడు మృతి చెందడంతో వారి వేదనకు అంతులేకుండా పోయింది.

పరామర్శల వెల్లువ

మృతురాలు రాజవ్వ కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు పరామర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎంపీ బండి సంజయ్‌ బాధిత కుటుంబాలను ఫోన్‌లో పరామర్శించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, వేములవాడ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు పరామర్శించారు. కాంగ్రెస్‌ కోనరావుపేట మండలాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌పాషా, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ పల్లె మంజుల, ఎంపీపీ చంద్రయ్య తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తహసీల్దార్‌ విజయప్రకాశ్‌రావు హామీ ఇచ్చారు. మృతురాలి కూతురు సరిత ఫిర్యాదుతో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘కూలి’న బతుకులు
1/2

‘కూలి’న బతుకులు

‘కూలి’న బతుకులు
2/2

‘కూలి’న బతుకులు

Advertisement
 
Advertisement
 
Advertisement