ఓట్లకు బదులు.. దౌర్జన్యాల దారి! | - | Sakshi
Sakshi News home page

ఓట్లకు బదులు.. దౌర్జన్యాల దారి!

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

పరిషత్‌ పోరుపై పచ్చగూండాల గురి నామినేషన్ల నుంచే దౌర్జన్యకాండ అభ్యర్థులు, ఏజెంట్లకు పోలీసుల బెదిరింపులు రిగ్గింగ్‌కు రంగం సిద్ధం.. ప్రత్యర్థులపై నిర్బంధాలు

ప్రలోభాలు... బెదిరింపులు

ప్రజా తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక.. దౌర్జన్యాలనే గెలుపు మార్గంగా ఎంచుకున్నారు అధికార కూటమి పార్టీ నేతలు. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. నామినేషన్ల

దశలోనే ప్రత్యర్థులను అడ్డుకోవడం.. మహిళా అభ్యర్థులపై దాడులు.. పోలీసుల బెదిరింపులకు గురిచేశారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణ.. ఏకగ్రీవాల కోసం అక్రమ మార్గాలు ఎంచుకున్నారు. ఇప్పుడు పోలింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులపై నిర్బంధాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ప్రాదేశిక పోరు కీలక ఘట్టానికి చేరుకుంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తుండగా, అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం నామినేషన్ల దశలో చూపించిన గూండాగిరిని పోలింగ్‌ సమయంలోనూ ప్రదర్శించి బీభత్సం సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఖాకీలు అండగా నిలుస్తుండడంతో పచ్చపార్టీ గూండాల దాదాగిరికి అంతే లేకుండా పోతోంది. నామినేషన్ల సమయంలో పొదిలి, తర్లుపాడు, పీసీపల్లి తదితర ప్రాంతాల్లో మహిళా అభ్యర్థుల దుస్తులు లాగి సభ్య సమాజం తలదించుకొనేలా కర్రలు, కత్తులతో టీడీపీ గుండాలు, పోలీసులు దౌర్జన్యకాండ సాగించారు. దర్శి, కనిగిరి, గిద్దలూరు, కొండపి, మార్కాపురం, కందుకూరు, ఇలా పలు ప్రాంతాల్లో ఎంపీటీసీ నామినేషన్లు వేయకుండా చేసి ఏకగ్రీవం చేసుకున్నారు. ఏదో రకంగా కష్టపడి నామినేషన్లు వేసిన అభ్యర్థుల దరఖాస్తులను సిల్లీ రీజన్స్‌తో తిరస్కరించారు. కొన్ని ప్రాంతాల్లో మిగిలిన నామినేషన్‌లను ఉపసంహరించుకొనేలా పోలీసులను ప్రయోగించారు. ఏకంగా అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని లేకపోతే, గంజాయి కేసులు పెడతామని భయపెట్టి మరీ నామినేషన్లు ఉపసంహరించేలా భయభ్రాంతులకు గురిచేశారు.

ప్రకాశం జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 25 జెడ్పీటీసీ స్థానాలకు 98 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 371 ఎంపీటీసీలకు 151 స్థానాలు ఏకగ్రీవం కాగా, 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో 599 మంది అభ్యర్థులు నిలిచారు. పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికలో 10,70,902 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. ఇందులో 5,30,739 మంది పురుషులు, 5,40,137 మహిళలు, ఇతరులు 26 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో మహిళల ఓటర్లే కీలకం కానున్నారు. 1265 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా అందులో ఆరు స్థానాలను అధికార పార్టీ అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవం చేసుకుంది. ప్రస్తుతం 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 63 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 275 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేవలం 57 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. 138 మంది ఎన్నికల రంగంలో నిలిచారు. జిల్లాలో ఎన్నికలు జరిగే స్థానాలకు సంబంధించి 5,62,482 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు 2,85,168 మంది, సీ్త్రలు 2,77,300 మంది ఉన్నారు. జిల్లాలో 118 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. బుధవారం మండల కేంద్రాల నుంచి పోలింగ్‌ సామగ్రి తీసుకొని తమకు కేటాయించిన స్థానాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకున్నారు. మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్టేషన్లల్లో సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌, సాధారణ కేంద్రాలుగా వర్గీకరించారు. హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్‌ స్ట్రీమింగ్‌) ఏర్పాటు చేశామని కలెక్టర్‌ రాజబాబు తెలిపారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో సైతం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల భాగస్వామ్మంతో లాప్‌టాప్‌లు, వెబ్‌ కెమెరాలు, పెన్‌ డ్రైవ్‌ల ద్వారా డేటాను నిరంతరం ఫీడ్‌ చేయడం ద్వారా వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు...గట్టి బందోబస్తు

ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం 2,391 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో నిస్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. 714 పోలింగ్‌ లొకేషన్లల్లో 1260 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. అందులో 83 అత్యంత సమస్యాత్మక, 149 సమస్యాత్మక, 482 పోలింగ్‌ కేంద్రాలను సాధారణ ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. నియమించిన సిబ్బందికి అదనంగా 34 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ఏఎస్పీలు 2, డీఎస్పీలు 6, సీఐలు 26 మందితో ప్రత్యేక ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 141 రూట్‌ మొబైల్‌ వాహనాలను అందుబాబులో ఉంచామన్నారు. 974 మందిని బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు ఎర్ర చూపి ప్రసన్నం చేసుకొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. లొంగని దగ్గర బెదిరింపులకు దిగుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న పోలింగ్‌ ఏజెంట్లు, నేతలు, చివరకు అభ్యర్థులనే అదుపులోకి తీసుకొంటున్నారు. దారికి రాని చోట్ల పోలింగ్‌ బూత్‌ ఉన్న ఏజెంట్లను పోలీసుల చేత లాగి, రిగ్గింగ్‌ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పోలీసులు, సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరించి పచ్చనేతలకు సహకరిస్తున్నారు. గురువారం జరిగే ఎన్నికల్లోనైనా తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement