ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కొప్పెరపాడులో కూలిన కోళ్ల ఫారం జెడ్పీటీసీ, ఎంపీటీసీఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మేదరమెట్ల: మేదరమెట్ల ఫైఓవర్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మేదరమెట్ల స్టేషన్‌ ఎస్సై రుమేష్‌బాబు, రైటర్‌ రమేష్‌ వివరాల ప్రకారం..మంగళవారం రాత్రి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరనేది వివరాలు తెలియ రాలేదు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుని ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

బేస్తవారిపేట: ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బేస్తవారిపేట జంక్షన్‌లో గోల్డెన్‌ రెస్టారెంట్‌ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై అడ్డదిడ్డంగా నడుచుకుంటూ వెళ్తూ సడన్‌గా రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గిద్దలూరు నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా 108 సిబ్బంది క్షతగాత్రున్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుని వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహాన్ని గుర్తిస్తే సమాచారం అందించాలని ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి కోరారు.

● రూ.15 లక్షల వరకు నష్టం

బల్లికురవ: మురుసు తుఫాన్‌ ప్రభావంతో వీచిన గాలులకు కోళ్లఫారం కూలింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొప్పెరపాడు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన బుర్రి ఏడుకొండలు వ్యవసాయంలో ఆటుపోట్లతో కోళ్ల ఫారం ఏర్పాటుచేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తుఫాన్‌ ప్రభావంతో వీచిన భారీ గాలులు, భారీ వర్షానికి రేకులు మొత్తం కిందపడి పగిలిపోయాయి. రేకుల కింద కోళ్లని చనిపోవడంతో రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

● ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లాలో నవంబర్‌ 5న నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల్లో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను, స్పెషల్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారని, జిల్లా, అంతర్‌ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు, మద్యం అక్రమ రవాణాపై విస్తృతంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ సామగ్రి, ఎన్నికల సిబ్బందికి పోలీస్‌ భద్రత కల్పించడంతో పాటు పోలింగ్‌ కేంద్రాలను హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌, సాధారణ కేంద్రాలుగా వర్గీకరించి తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌, డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశారని, పోలీస్‌ సిబ్బంది మధ్య సమన్వయం కోసం వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్‌ బాక్సుల తరలింపు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద రెండు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా ఎంసీసీ నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, పోలీస్‌ యాక్ట్‌–30, బీఎన్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ సెక్షన్‌–163 నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించారు. గుంపులుగా గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం, సోషల్‌ మీడియాలో తప్పుడు, విద్వేషపూరిత ప్రచారాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా పోలీస్‌ ఎన్నికల కంట్రోల్‌ రూం నంబరు 91211 04783 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement