స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

కందుకూరు: నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించి అర్హులైన ప్రతి ఓటర్‌ తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఇటు పోలీసులు, అటు అధికార పార్టీ గూండాలను దాటుకుని ప్రాణాలకు తెగించి తమ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారని గుర్తు చేశారు. కానీ ఏ స్థానంలోనైతే వైఎస్సార్‌సీపీ బలంగా ఉండి గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ స్థానాల్లోని అభ్యర్థుల నామినేషన్‌లను పరిశీలనలో ఎత్తివేశారన్నారు. ఇలా నియోజకవర్గంలో 19 మంది ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌లను సరైన కారణాలు లేకుండానే తిరస్కరించారన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో గురువారం జరిగే ఎన్నికల్లో సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన వారు రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని వీటిని ముందుగానే అరికట్టాలని సూచించారు.

పాత సంస్కృతిని మళ్లీ ప్రారంభించారు.

20 ఏళ్ల క్రితం కందుకూరు ప్రాంతంలో దాడులు, హత్యలు, దోపిడీలు వంటి దారుణాలకు అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు పాల్పడేవారు. ఈ దారుణాలతో భయపడిపోయిన నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ల పాటు ఆ పార్టీకి నియోజకవర్గంలో అధికారం అనేది లేకుండా చేశారు. గడిచిన 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఒక్కటే చిన్న సంఘటన జరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో మళ్లీ పాత సంస్కృతికి నాందిపలికారు. ఎమ్మెల్యే కోసం గ్రామాల్లోని టీడీపీ నాయకులు బరితెగించవద్దని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఇంటూరి నాగేశ్వరరావు హైదరాబాద్‌ పారిపోతాడని చెప్పారు. షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వడ్లమూడి సురేష్‌ ఈ దాడులకు నాయకత్వం వహిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై జరిగిన దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయని వివరించారు. వందల కోట్ల అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం ఇటువంటి దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమోచ్చిందో, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే ఒకేఒక్క భయంతోనే ఎమ్మెల్యే అరాచకాలకు తెరలేపారని వివరించారు. దమ్ముంటే పోలీసులు, అధికారులను అడ్డంపెట్టుకుని కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని గెలవాలని సవాల్‌ చేశారు. ఎమ్మెల్యే ఇంటూరికి సరైన గుణపాఠం చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ తరుపున 38 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 5గురు జెడ్పీటీసీ అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

నామినేషన్‌ల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలు పునరావృతం కారాదు

20 ఏళ్ల తరువాత కందుకూరులో

మళ్లీ పాత సంస్కృతికి నాంది పలికారు

అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డ

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆదరించండి

విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement