తుఫాన్‌ పోయినా.. చీకట్లు పోలే! | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ పోయినా.. చీకట్లు పోలే!

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

తుఫాన్‌ పోయినా.. చీకట్లు పోలే! „ మొదటిపేజీ తరువాయి..

వున్న సైకిల్‌స్టాండు వద్ద చెట్టు కొమ్మలు పడిపోయి ఉన్నాయి. ఇప్పటికీ రెండు రోజులు గడిచిపోయాయి. అయినా నగర పాలక సంస్థ అధికారులు ఇటువైపు తొంగిచూసిన పాపాన పోలేదు. పడిపోయిన చెట్లు పడిపోయినట్టే ఉన్నాయి. సాక్షాత్తు కలెక్టర్‌ కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే శివారు కాలనీలు, గ్రామాల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు.

ఎక్కడి చెట్లు అక్కడే..

నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. నగరంలో నడిబొడ్డున ఉన్న చర్చి సెంటర్లోని మహావృక్షం కూలిపోయింది. అయినా నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదు. దాంతో చర్చి నిర్వాహకులే కూలీలను పెట్టి చెట్టును పక్కకు తొలగించుకున్నారు. అలాగే తూర్పు బజారులోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని వేప చెట్టు స్కూలు పక్కనే రంగుతోటకు వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఇటువైపు రాకపోకలకు అవస్థలు ఎదురవుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయం రోడ్డులో ఒక ఇంటి ఆవరణలోని భారీ చెట్టు పడిపోయింది. అదే దారిలో అనేక చిన్న చిన్న చెట్లు కూలిపోయాయి. అన్నవరప్పాడు 4వ లైను కరెంటు ఆఫీసు వెనక వైపున ఒక ఇంటి మీద చెట్టు కూలింది. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందనలేదు. ఏబీఎం కాలేజీ దారిలో తహశీల్దార్‌ కార్యాయం ఎదురుగా రోడ్డు మీద విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయి. రాంనగర్‌ 4వ లైనులో కూడా చెట్లు విరిగిపడిపోయాయి. నగరం నలుమూలల అనేక డివిజన్లలో, నగర శివారు ప్రాంతాల్లోని అనేక కాలనీల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగిపోయినట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.

రోగులు, వృద్ధుల ఇక్కట్లు:

రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో నగరంలోని 14 కాలనీల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో మంచినీటి సరఫరా కూడా నిలిపేశారు. దాంతో ఒకవైపు చీకటి, మరోవైపు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా వీలులేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్దుల పరిస్థితి దారుణంగా ఉంది. గుండె జబ్బులు రోగులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు నరకం అనుభవిస్తున్నారని చెబుతున్నారు.

సంబరాల్లో ప్రజా ప్రతినిధులు:

మురసు తుఫాను ప్రభావంతో నగరంలోని అనేక కాలనీల్లో వరద నీరు వచ్చింది. ఈదురు గాలుల తీవ్రతకు విద్యుత్‌ తీగలు తెగి పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రజా ప్రతినిధులకు ఇవేమీ పట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల మీద ఉన్న శ్రద్ద తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద లేకపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున ప్రజలు అంధకారంలో అల్లాడిపోతుంటే మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో సంబరాలు చేసుకుంటున్న నాయకుల తీరు చూసి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాగులుప్పలపాడు మండలంలో తుఫాన్‌ బీభత్సం:

నాగులుప్పలపాడు మండలంలో ఎటు చూసినా ఎగిరిపోయిన పూరిళ్లు, కూలిన గోడలు, ఇళ్లు, నామరూపాల్లేకుండా పోయిన విద్యుత్‌ వ్యవస్థతో మండల వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. మురసు సృష్టించిన బీభత్సం గతంలో వచ్చిన దివిసీమ తుఫాన్‌ను గుర్తు చేసింది. మంగళవారం వేకువ నుంచి ప్రచండమైన గాలుల ధాటికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో వందల కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీయడంతో ఒక్కసారిగా విద్యుత్‌ వ్యవస్థకు అంతరాయం కలిగింది. అప్పటి నుంచి బుధవారం వరకు మండలంలో మొత్తం గాడాంధకారంలో ఉంటోంది. శతాబ్దాల కాలం నాటి భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. అత్యవసరంగా విద్యుత్‌ లైన్లు పునరుద్ధరించడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విద్యుత్‌ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు రోజులుగా శ్రమిస్తున్నా ఏ ఒక్క పనీ కొలిక్కిరాలేదు.

బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు:

మంగళవారం అర్ధరాత్రి వేలాది స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ అంతరాయం వల్ల అందరి ఫోన్లు మూగబోయాయి. అలాగే పలు కంపెనీల సెల్‌టవర్లు కూడా దెబ్బతినడంతో మండలంలోని ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు, వినోదరాయునిపాలెం, కనపర్తి, నీలయపాలెం, ఈదుమూడి, మట్టిగుంట, రాపర్ల, మాచవరంతో సహా పలు గ్రామాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతింది. బుధవారం నాటికి కూడా పునరుద్ధరణ కాలేదు. పూర్తిగా అందుబాటులోకి రావాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. మండల వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేశారు. వేలాది ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారంతా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement