ఆలస్యం చేసి కూటమికి అనుకూలం చేసే ఎత్తుగడ వైఎస్సార్ సీపీకి మెజార్టీ వచ్చినా కావాలనే రీ కౌంటింగ్‌లు కూటమి వారికి తక్కువ మెజార్టీ వచ్చినా రీ కౌంటింగ్‌కు ససేమిరా ఎట్టకేలకు మమ అనిపించిన కౌంటింగ్ ప్రక్రియ కూటమి పార్టీలకు 48, వైఎస్సార్ సీపీకి 11, ఇండిపెండెంట్లు ముగ్గురు ఇందులో మూడు ఏకగ్రీవం
వైఎస్సార్‌సీపీ కేడర్‌తో ఆనందోత్సాహాలతో కౌంటింగ్ సెంటర్‌లో
కావటి రవి కుమార్
ఆర్‌ఓ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫాం తీసుకుంటున్న 29వ డివిజన్
కార్పొరేటర్ కావటి రవి కుమార్
ఒంగోలు సబర్బన్:
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ అభ్యర్థులు, ఏజెంట్ల సహనానికి పరీక్ష పెట్టింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మొదలైన లెక్కింపు.. బుధవారం సాయంత్రం వరకూ కొనసాగింది. తుఫాన్ సాకుతో ఎన్నికల యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా కౌంటింగ్ నిర్వహించారన్న ఆరోపణలు వినిపించాయి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారా? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు నగరానికి సంబంధించి మేయర్‌తో పాటు 59 మంది కార్పొరేటర్ల ఎన్నికల కౌంటింగ్‌ను రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేపట్టారు. మురసు తుఫాన్ కారణంగా కౌంటింగ్ పది గంటలు ఆలస్యంగా ప్రారంభమై నత్తను తలపించింది. కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల కౌంటింగ్ చాలా ఆలస్యం చేశారు. ఒక పద్దతి పాడు లేకుండా చేపట్టడం ద్వారా లెక్కింపు పూర్తి చేయటానికి రెండు రోజులు పట్టింది. కౌంటింగ్ ప్రక్రియ ఎంత ఆలస్యం చేస్తే కూటమి పార్టీలకు అంత మేలు జరుగుతుందన్నట్లు సాగింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే ఒకటికి నాలుగు సార్టు రీ కౌంటింగ్ చేపట్టేలా అధికార కూటమి పార్టీ నాయకులు రచ్చరచ్చ చేశారు. అదే అధికార కూటమి అభ్యర్థులు తక్కువ ఓట్లతో గెలిచినా రీ కౌంటింగ్‌కు మాత్రం ససేమిరా అంటూ అధికారులు ముగించేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 29వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కావటి రవి కుమార్ 106 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తే దానిని కూడా లెక్కచేయకుండా నాలుగు సార్లు రీ కౌంటింగ్ చేపట్టేలా టీడీపీ నాయకులు నానా యాగీ చేశారు. డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు కూడా మెలికపెట్టి చివరకు అబ్జర్వర్ వస్తే కానీ ప్రకటించొద్దంటూ హడావుడి చేశారు. ఇక 11 డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మరపాల స్వాతి విజయం సాధించిందని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. చివరకు ఒకటికి నాలుగు సార్లు రీ కౌంటింగ్ పెట్టించి మరీ బీజేపీ అభ్యర్థి బలమోరు విజయ లక్ష్మి విజయం సాధించినట్లు ప్రకటించారు. ఈ రెండు ఘటనలు అధికారులు చూస్తే అధికార పార్టీకి ఎంతలా సాగిలపడ్డారో అవగతమవుతుంది.
రెచ్చిపోయిన తాలూకా సీఐ..
ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అడుగడుగునా పోలీసులను అడ్డంపెట్టుకొని మరీ ముందుకు సాగారు. ఎన్నికలకు ముందు రోజు ఒంగోలు తాలూకా పోలీసులు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించటంతో పాటు చీఫ్ ఏజెంట్లను, ఏజెంట్లను సైతం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుల్లో ఒక రకమైన భయభ్రాంతులకు గురిచేశారు. దానికితోడు కౌంటింగ్ సెంటర్‌లో కూడా అభ్యర్థులను, ఏజెంట్లను నోరు మెదపనీయకుండా కట్టడి చేసే కార్యక్రమాలకు తెరలేపారు. ప్రధానంగా తాలూకా సీఐ విజయ కృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను భయపెట్టేలా ప్రవర్తించారు. అదేమని ప్రశ్నిస్తే బయటకు పంపేస్తా అంటూ జులుం ప్రదర్శించారు. మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ మీదకే పదేపదే దూకుడుతనంగా ప్రవర్తించారు.
వైఎస్సార్ సీపీకి 11 కార్పొరేటర్ స్థానాలు:
ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి 11 కార్పొరేటర్ స్థానాలు దక్కాయి. మేయర్ స్థానాన్ని కూటమి పార్టీలోని టీడీపీ కై వసం చేసుకుంది. టీడీపీ మేయర్‌గా నల్లమల్లి శ్రీ శిల్ప విజయం సాధించింది. నల్లమల్లి శ్రీ శిల్పకు 61,607 ఓట్లు రాగా కుప్పం ప్రసాద్‌కు 24,435 ఓట్లు వచ్చాయి. ఇక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులుగా 1వ డివిజన్‌లో గరికముక్కల రాణీ ప్రియాంక్ విజయం సాధించింది. 4వ డివిజన్‌లో ఎస్‌కే సుబేదార్ హజరత్ వలి, 13వ డివిజన్‌లో అంబటి అర్జున్, 14వ డివిజన్‌లో పట్రా మేరీ, 16వ డివిజన్‌లో గొర్రెముచ్చు సలోమి, 24వ డివిజన్‌లో దాసరి వెంకటేశ్వర్లు, 29వ డివిజన్‌లో కావటి రవి కుమార్, 39వ డివిజన్‌లో పూనూరి సౌజన్య, 49వ డివిజన్‌లో తేళ్ల సుమన్, 54వ డివిజన్‌లో ఎదురు మాల్యాద్రి, 55వ డివిజన్‌లో పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు. కూటమిలోని పార్టీలకు టీడీపీకి 39, జనసేనకు 8, బీజేపీకి ఒకటి, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు. విజయం సాధించిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రాజాబాబు డిక్లరేషన్ ఫారాలు అందించారు. నగరంలో మొత్తం 62 డివిజన్లు ఉండగా మూడు డివిజన్లు బెదిరింపులకు గురిచేసి అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది.


