● మరొకరికి తీవ్ర గాయాలు
ఫిరంగిపురం: వాహనం ఢీకొట్టడంతో ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రేపూడి గ్రామ శివారు సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన బి.వంశీ, ఫిలిప్‌లు ద్విచక్రవాహనంపై గుంటూరు వైపు వెళుతున్నారు. మండలంలోని నుదురుపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో బి.వంశీ (21)అక్కడికక్కడే మృతిచెందాడు. ఫిలిప్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరూ మేడికొండూరు మండలం విశదల సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
● డ్రైవర్ కు గాయాలు
ఉలవపాడు: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ట్రాలీ ఢీ కొనడంతో ట్రాలీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జాతీయరహదారి పోలీసుల వివరాల మేరకు.. చాగల్లు వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.కృష్ణపట్నం పోర్టు నుంచి చీమకుర్తి వెళుతున్న ట్రాలీ ముందులారీ బ్రేక్ వేయడంతో లారీ ని ఢీ కొట్టింది. బలంగా ఢీ కొనడంతో డ్రైవర్ ట్రాలీక్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. హైవే, రోడ్‌సేఫ్టీపోలీసులు, తోటి లారీ డ్రైవర్ల సహాయంతో బయటకుతీశారు. ప్రమాదంలో .పొందూరు కుచెందిన జగదీష్ చౌదరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుని 108 సిబ్బంది ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు కేంద్రాలను ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం పరిశీలించారు. సెయింట్ జేవియర్ స్కూలు, డాన్ బాస్కో ఐటీఐ, ఆక్జీలీయం హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. 100 మీటర్ల దూరంలో ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్ప ఇతరులు లేకుండా చూడాలని చెప్పారు. ఎన్నికలు ఎటువంటి పక్షపాతం లేకుండా, సజావుగా జరిగేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సమన్వయంతో విధులు నిర్వహించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు వివరించారు. ఎస్పీతో పాటుగా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వున్నారు.


