వెబ్‌ కాస్టింగ్‌ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వెబ్‌ కాస్టింగ్‌ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు

Nov 1 2026 7:37 AM | Updated on Nov 1 2026 7:37 AM

వెబ్‌ కాస్టింగ్‌ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు ఎన్నికలకు సర్వ సన్నద్ధం

ఒంగోలు సబర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్‌ సరళిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌తోపాటు చీమకుర్తి, అద్దంకి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రతి పోలింగ్‌ గదిలో సీసీ టీవీలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా కేంద్రాల్లో పరిస్థితిని నిశితంగా గమనించేలా కలెక్టర్‌ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ పి.రాజాబాబు శనివారం పరిశీలించారు. కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ వీక్షించే సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేంద్రంలో 1077 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకునే సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా అభ్యర్థనలు, ఫిర్యాదులు వస్తే వెంటనే సంబంధిత ఆర్వోలకు సమాచారం అందించేలా ప్రత్యేక కమ్యూనికేషన్‌ హ్యాండ్‌ సెట్స్‌ కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఇన్చార్జి మాధురి, ఇతర అధికారులు ఉన్నారు.

ఒంగోలు సిటీ: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రితో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి సిబ్బంది తమ కేటాయించిన కేంద్రాలకు వెళ్లారు. ఒంగోలు కార్పొరేషన్‌ కు సంబంధించి శనివారం రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు, జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.హెప్సిబా రాణి, వ్యయ పరిశీలకులు వివేక్‌ సందర్శించి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల వారీగా తమకు కేటాయించిన సామగ్రిని తనిఖీ చేసుకున్నారు. భోజనం అనంతరం తమకు కేటాయించిన వాహనాల్లో గట్టి భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరారు. విధుల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వారికి చెప్పారు. ఎన్నికల సంఘ నిబంధనల మేరకు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్లు నిరంతరం నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement