పోలింగ్‌ ముగిసే వరకు విశ్రమించొద్దు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ముగిసే వరకు విశ్రమించొద్దు

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

పోలింగ్‌ ముగిసే వరకు విశ్రమించొద్దు

ఒంగోలు టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నేడు ముగిసేంత వరకు విశ్రమించవద్దని, ముఖ్యంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పోలీసులను ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో ఒంగోలులోని పేస్‌ కాలేజీలో శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. పోలింగ్‌ ముగిసేంత వరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కేటాయించిన విధులను పూర్తి బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీల సమావేశాలు, జెండాలు, బ్యానర్లు, కటౌట్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలని చెప్పారు. ఓటర్లను క్రమపద్ధతిలో క్యూ లైన్లలో పంపించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాత మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు. ఓటర్లు మినహా ఇతరులు లోపలకు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు, జెండాలు, కటౌట్లు, ప్రచార సామగ్రి పోలింగ్‌ కేంద్రాల వద్ద కనిపించకుండా చూడాలన్నారు. పార్టీ గుర్తులతో కూడిన ఽటవల్‌ ధరించి ఓటు వేయడానికి అనుమంతిరాదన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఎక్కడా ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడరాదన్నారు. ఆర్వో పిలిచినప్పుడు మాత్రమే పోలింగ్‌ సిబ్బంది లోపలకు వెళ్లాలని సూచించారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బ్యాక్సుల భద్రతతో పాటు కౌంటింగ్‌ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) యుగంధర్‌ బాబు, అడిషనల్‌ ఎస్పీ (క్రైం) వెంకటేశ్వర్లు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ గురునాథబాబు, దర్శి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మహిళా డీఎస్పీ శ్రీధర్‌, పీటీసీ డీఎస్పీ బాలసుందరరావు పాల్గొన్నారు.

పోలీసులకు ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement