ఒంగోలు సబర్బన్: ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఆర్వోలతో శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ఆర్వోలపై ఉందన్నారు. ఆర్వోల హ్యాండ్ బుక్కుపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ద్వారా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ఆ దిశగా అవగాహన పెంచుకోవడంతో పాటు తమ పరిధిలోని సిబ్బందికి కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆర్వోలదేనని అన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ రూమ్ వద్ద పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజు ఓటింగ్ సరళి, ఫలితాలను సత్వరమే వెల్లడించేందుకు, సంబంధిత వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలపై కలెక్టర్ రాజాబాబు సమీక్ష


