మార్కాపురం: త్రిపురాంతకం సీఐ రౌడీయిజం చేస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్పీ పంకజ్‌కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, 12 ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేసిన టీడీపీ రౌడీలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే గంజాయి, పాత కేసులు, ఇతర కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. టీడీపీ నాయకులు, గూండాలు దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో రాడ్లు, కర్రలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపై కలెక్టర్, ఎస్పీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, చలమారెడ్డి, షేక్ బుజ్జి, శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


