కందుకూరులో అరాచకపాలన | - | Sakshi
Sakshi News home page

కందుకూరులో అరాచకపాలన

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

కందుకూరు: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరులో ఏ విధమైన అరాచకపాలన నడుస్తోందో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తీరును గమనిస్తే అర్థమవుతోందని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి సోమవారం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కలిసిన అనంతరం విలేకరులతో బుర్రా మాట్లాడారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలంటూ అధికార పార్టీ నాయకులు, పోలీసులు పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులిస్తామని, ఒప్పుకోకపోతే ఏదో ఒక కేసుపెట్టి లోపలేస్తామని, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతామంటూ అనేక రకాలుగా పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా పోలీసులే ఫోన్‌లు చేసి పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరించడం ఏ ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదన్నారు. అదేమంటే కందుకూరులో బుర్రా రౌడీయిజం చేస్తున్నాడని ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని, అతని రౌడీయిజం ముందు తన రౌడీయిజం ఎంతంటూ ఎద్దేవా చేశారు. బుర్రా మధుసూదన్‌ అనే వ్యక్తి ఇక్కడ నిలబడి ఈ మాత్రమైనా మాట్లాడుతున్నందువలనే కాస్త అదుపులో ఉన్నారని, లేకుంటే టీడీపీ, ఇంటూరి అరాచకాలు ఏ స్థాయిలో ఉండేవో ఊహించడం కూడా కష్టమేనని బుర్రా అన్నారు. నిజంగా నువ్వు భయపడకపోతే పోలీసులను, గూండాలను, గంజాయి బ్యాచ్‌ను పెట్టుకుని ఎందుకు ఎన్నికలు చేస్తున్నావంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. అభివృద్ధి చేశానని చెబున్నావు కదా.. అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగు అంటూ హితవు పలికారు. ఎటువంటి ఆరాచకాలకు తావులేకుండా సక్రమంగా ఎన్నికలు చేసుకోవాలని పదేపదే చెబుతున్నా పట్టించుకోకుండా నీచస్థాయికి దిగజారి ఎన్నికల్లో గెలుపుకోసం అరాచరాలు చేస్తున్నావంటూ ఎమ్మెల్యేపై బుర్రా ధ్వజమెత్తారు. అవినీతిలో కూరుకుపోయి ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం లేక రౌడీయిజానికి దిగావంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

విత్‌డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు...

నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలంటూ అధికార పార్టీ నాయకులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని బడేవారిపాలెం ఎంపీటీసీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఉన్నం సుధాకర్‌ కుమారుడు వెంకట్రావ్‌ అన్నారు. అందుకు భయపడి తన తండ్రిని సీక్రెట్‌గా ఉంచామన్నారు. ఈ విషయం పోలీసులకు చెప్పి వీడియో కాల్‌లో తన తండ్రితో మాట్లాడిస్తామన్నా పోలీసులు ఒప్పుకోవడం లేదన్నారు. తన తండ్రిని తీసుకురావాలంటూ గ్రామస్తులను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. గ్రామస్తులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తన తండ్రిని తానే తీసుకువస్తానని పోలీసులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై మెయిల్‌ చేశానని, స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అరాచక పాలనలో ఉన్నాం...

ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సుధాకర్‌ ఆచూకీ చెప్పమని బెదిరిస్తూ తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఇంటూరి భారతి పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. అరాచక పాలనలో ఉన్నామో కూడా అర్థం కావడం లేదన్నారు. దీనిపై డీఎస్పీని కలిస్తే ఆయన స్పందన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఓటుతో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

నామినేషన్ల ఉససంహరణ కోసం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు

దమ్ముంటే ఎన్నికలను సక్రమంగా నిర్వహించి ఎమ్మెల్యే ఇంటూరి గెలవాలి

అరాచకాలపై జిల్లా ఎన్నికల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి

వైఎస్సార్‌ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement