● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్:
విద్యార్థులకు ప్రేరణ కలిగించడంతో పాటు భవిష్యత్తులో వారు పోలీసు శాఖలో చేరేలా ప్రోత్సహించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీసు శాఖ పనితీరుపై అవగాహన కలుగుతుందని చెప్పారు. పోలీసుల విధులు, ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణ అలవరచుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న ఆయుధాల ప్రదర్శన...
పోలీసుశాఖ ఓపెన్ హౌస్‌లో భాగంగా విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఉపయోగించే ఆయుధాలను ప్రదర్శించారు. ఏకే –47, 9ఎంఎం గ్లాక్ పిస్టల్, 5.56 ఎంఎం, 7.62 లైట్ మిషన్ గన్స్, 7.62 ఎంఎం ఎస్‌ఎల్‌ఆర్, ఫెడరల్ గ్యాస్ గన్, 303 రాయిట్ గన్, 303 రైఫిల్, ఇన్‌శాస్ రైఫిల్, 9 ఎంఎం కార్బన్, 51 ఎంఎం మోర్టార్, మల్టీ షెల్ లాంచర్, మెటల్ డిటెక్టర్, డ్రాగన్ లైట్, ర్యాకర్, బాంబు డిస్పోజల్ పరికరాలు, బాంబ్ బ్యాంకెట్, 207 వజ్ర వాహనం, డాగ్ స్క్వాడ్స్ బృందాలు, ట్రాఫిక్ పరికరాలు, డ్రోన్ కెమెరాలు, వేలి ముద్రలు సేకరించే పరికరాలను ప్రదర్శించారు. పోలీసు ఆయుధాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఉత్సాహపరచిన విన్యాసాలు...
పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా పలు విన్యాసాలను పోలీసులు ప్రదర్శించారు. రాక్సీ, సైరా, మగ్గీ అనే పోలీసు జాగిలాలు ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు గౌరవ వందనం చేయడంతో విద్యార్థులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం జాగిలాలు హార్డిల్ జంప్, ఫైర్ జంప్, ఒబిడియన్స్ విన్యాసాలను విద్యార్థులు సంబ్రమాశ్చర్యాలతో తిలకించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యుగంధర్‌బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.


