బాబు కుట్రలను తిప్పికొడతాం | - | Sakshi
Sakshi News home page

బాబు కుట్రలను తిప్పికొడతాం

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

నామినేషన్ల పర్వంలోనే టీడీపీ నైతికంగా ఓడిపోయింది వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ అయోధ్య రామిరెడ్డి

ఒంగోలు సిటీ: నామినేషన్‌ పర్వంలోనే కూటమి పార్టీలు నైతికంగా ఓడిపోయిందని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకలేకపోయిందని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని విజ్ఞులైన ప్రజలు గుర్తించారన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేస్తే గెలిచిపోతారన్న భయంతో అధికార పార్టీ చేయని కుట్రలు లేవని ధ్వజమెత్తారు. దౌర్జన్యం చేసి నామినేషన్లను అడ్డుకోవడం, చిన్న చిన్న కారణాలు చూపుతూ మా పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని విమర్శించారు. ఒంగోలు నగరంలో పార్టీ మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, 53, 54, 55 డివిజన్లలో పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబులతో కలసి ప్రచారాన్ని నిర్వహించారు. రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగుచెందారని, మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారన్నారు. ఒంగోలు వైఎస్సార్‌ సీపీకి కంచుకోటగా ఉందన్నారు.

సుప్రీం తీర్పును గౌరవించడం లేదు:

నామినేషన్ల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలను గుర్తించిన సుప్రీం కోర్టు 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తిరిగి నామినేషన్లకు గడువు ఇవ్వాలని సూచించిందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. దానిని అమలు చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గౌరవించడంలేదని విమర్శించారు. స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునే పరిస్థితి ఉండాలని, అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును సైతం వినియోగించుకునేలా ఉండాలన్నారు. అయితే నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవని గుర్తించిన సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసిందన్నారు. వాటిని అమలు చేయకపోవడం దారుణమన్నారు. అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్‌ పత్రాలు దౌర్జన్యంగా లాక్కుని చించేసే పరిస్థితులు చూస్తుంటే కూటమి పార్టీలకు ప్రజలపై నమ్మకం లేనట్టుగా ఉందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పరిస్థితి ఇలా ఉంటే పరిషత్‌ ఎన్నికల్లో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. మా ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ ముందుకు రాలేదని, ఇప్పుడేమో మా పార్టీ వాళ్లను పోటీ చేయకుండా అడ్డుకుంటోదని విమర్శించారు. సరిగ్గా ఎన్నికల ప్రక్రియ సాగితే కూటమి పార్టీ ఓడిపోతుందని తెలిసే రకరకాల కుట్రలకు తెరతీశారన్నారు. పెరిగిపోయిన నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కూటమి పార్టీల బెదిరింపులకు మా కేడర్‌ జంకదని, ఎన్ని కష్టాలలైనా భరిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బెదిరేదిలేదన్నారు.

దొంగ నామినేషన్లు సిగ్గు..సిగ్గు:

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవలేక చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తోందని దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేక మా పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ప్రాదేశిక ఎన్నికల్లో మా పార్టీ నాయకుల పేరుతో దొంగ నామినేషన్లు వేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నంత కాలం ఎన్ని కష్టాలు ఎదురైనా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు. ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ను, డివిజన్లలో నిలబడ్డ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని విమర్శించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో విఫలం అయిందన్నారు. ఆకాశాన్నంటిన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఒంగోలు నగరంలో దోమల బెడద, మురికి కాలువలు పూడిక తీయక, మంచినీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నగర మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ ను గెలిపిస్తే అవినీతి లేని పాలన అందించడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.

ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషదాయకమన్నారు. గెలిచిన వెంటనే మొదటిగా డ్రైనేజీ వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో ఒక్క పనీ సక్రమంగా చేయలేదని విమర్శించారు. పోతురాజు కాలువ పనులు కూడా చేయలేదన్నారు. స్లమ్‌ ప్రాంతాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. వేసిన రోడ్లనే పగులుగొట్టి పనులు చేయడం తప్ప ఏ పనులూ చేపట్టలేదన్నారు. డివైడర్‌ పగులగొట్టి డివైడర్‌ వేయడం అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు. చిన్నపాటి వర్షానికి సైతం ఒంగోలు రోడ్లపై నీరు నిలబడే పరిస్థితి ఉందన్నారు. ప్రచారంలో ప్రజలందరూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. జగన్నన్నకు ఒంగోలు మేయర్‌, కార్పొరేటర్లు గెలిచి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకులు వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, 53వ డివిజన్‌ కార్పొరేటరు అభ్యర్థి నాలి నాగేంద్రబాబు, 54 డివిజన్‌ కార్పొరేటరు అభ్యర్ధి ఎదురు మాల్యాద్రి, 55 డివిజన్‌ కార్పొరేటరు అభ్యర్ధి పల్నాటి రవీంద్రారెడ్డి, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement