సీట్లు..రూ.కోట్లు | - | Sakshi
Sakshi News home page

సీట్లు..రూ.కోట్లు

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

కాస్ట్లీగా మారిన స్థానిక సంస్థల టికెట్లు

పార్టీ కీలకనేత కనుసన్నల్లో బేరసారాలు..!

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి రూ.25 కోట్లు

మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు భారీగా ధర పలికిన వైనం

జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకూ రేట్లు

పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్లకు టీడీపీ నేతల అడ్డంకులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: స్థానిక పదవులకు కోట్లలో బేరాలు.. పోటీదారులను నిలువరించేందుకు దౌర్జన్యాలు.. నామినేషన్ల దశలోనే అడ్డగింతలు! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పదవులను ఆర్థిక లబ్ధికి మార్గంగా మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి రూ.25 కోట్ల వరకు బేరం సాగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీ, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాల వరకు రేట్లు నిర్ణయించారనే చర్చ సాగుతోంది.

కోట్ల బేరాలకు తెర..

ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠానికి రూ.25 కోట్లు, మార్కాపురం జెడ్పీ స్థానానికి రూ.10 కోట్లు, మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బేరాలు సాగినట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ధరలు నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారాల వెనుక పార్టీలో పై స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

నామినేషన్లకే అడ్డంకులు..

మరోవైపు ఎన్నికల్లో ప్రత్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో దాడులు, బెదిరింపులు, నామినేషన్లకు అడ్డంకులు ఎదురయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టించారు. మహిళా అభ్యర్థులపైనా దాడులకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల నామినేషన్‌ కేంద్రాలకు వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం, దాడులకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల పరిశీలనలోనూ తమ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులే అడ్డంకులా?

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా చూడాల్సిన పోలీసులపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్‌ సీపీ ఆరోపిస్తోంది. కొన్నిచోట్ల పోలీసుల సమక్షంలోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని, అభ్యర్థులపై దాడులు జరిగినా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement