ఒంగోలు ప్రగతి పథం..! | - | Sakshi
Sakshi News home page

ఒంగోలు ప్రగతి పథం..!

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

వైఎస్సార్‌ సీపీ హయాంలో

వైఎస్సార్‌ సీపీ హయాంలో

చరిత్రలో నిలిచేలా ఒకే ప్రాంతంలో రూ.350 కోట్లు వెచ్చించి 28 వేల మందికి ఇళ్ల పట్టాలు, ఏళ్ల తరబడి నగర ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను చెక్‌ పెట్టేలా రూ.400 కోట్లతో మంచినీటి పథకం, మరుగునపడిన పోతురాజు కాలువ ఆధునికీకరణకు రూ.98 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.10 కోట్లు..ఇలా చెప్పుకుంటే ఒకటేంటి వైఎస్సార్‌ సీపీ హయాంలో ఒంగోలు నగరం ప్రగతి పథంలో సాగింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వందల కోట్ల రూపాయలు నగర అభివృద్ధికి కేటాయించారు.

ఒంగోలు సబర్బన్‌: వైఎస్సార్‌ సీపీ హయాంలో ఒంగోలు నగరంలో అభివృద్ధి పరుగులు తీసింది. ఇళ్ల పట్టాలు, తాగునీరు, డ్రైనేజీ ఇలా ప్రజల మౌలిక అవసరాల కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న నగర జనాభా, శివారు ప్రాంత ప్రజలకు సైతం సౌకర్యాలుకల్పించేందుకు రూ.2 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా సాగర్‌ జలాలను వాడుకోవటంతో పాటు గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన మంచినీటి పథకం ద్వారా నగర ప్రజలకు ప్రతి రోజూ మంచినీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రూ.400 కోట్లతో

మంచినీటి పథకం మంజూరు...

ఒంగోలు నగర ప్రజలకు మంచినీటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు, ప్రతి రోజూ మంచినీరు అందించేందుకు రూ.400 కోట్ల వ్యయ అంచనాలతో ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు కలుపుకొని పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా ధనం రాకపోవడంతో పథకం ఆలస్యమైంది. లేకుంటే ప్రస్తుతం ఒంగోలు నగరంలో ఉన్న పాత మంచినీటి పధకం పైపులైన్లు మొత్తం మార్చి పెరుగుతున్న నగరానికి తగ్గట్టు మంచినీటి సరఫరా పైపులైన్లు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. శివారు ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని రూపకల్పన చేశారు.

రెండున్నరేళ్లుగా కాలయాపన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వంలో పూర్తిగా అటకెక్కింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఈ పథకాన్ని విస్మరించారు. నగర ప్రజల తాగునీటి సమస్యను చెక్‌ పెట్టేలా రూపొందించిన ఈ పథకాన్ని ముందుకు సాగనీయకుండా ఎమ్మెల్యే కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రన్తుతం ఎన్నికలు రావటంతో మళ్లీ మంచినీటి పథఽకం గుర్తొచ్చింది. నగర ప్రజలకు ప్రతి రోజూ మంచినీళ్లూ ఇస్తామని ఓటర్లకు అబద్ధాలు చెబుతున్నారు. రెండున్నరేళ్లుగా ఈ పథకాన్ని గాలికొదిలేసిన ఎమ్మెల్యే...మరోసారి ప్రజలను మోసం చేసేందుకు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఈ పథకంపై ఆశలు పుట్టిస్తున్నారు.

పేదల ఇళ్ల కల నెరవేర్చేందుకు..

ఒంగోలులో అద్దె ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం యరజర్ల గ్రామంలో 818 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఈ స్థలంలో మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించింది. సుమారు 23,531 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించేందుకు భూమిని చదును చేయించి, ప్లాట్లుగా విభజించి, హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. అయితే అంత మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తే తన రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించిన దామచర్ల జనార్దన్‌ తన ప్రధాన అనుచరుడైన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావుతో హైకోర్టులో కేసు వేయించాడు. సదరు స్థలం మైనింగ్‌కు కేటాయించారని హైకోర్టుకు వెళ్లాడు. అయితే సదరు శ్రీనివాసరావు ఆ స్థలాన్ని మైనింగ్‌కు ఇచ్చినప్పుడు..వద్దని శ్రీనివాసరావు ఆందోళనలు సైతం చేశాడు. కేవలం దామచర్ల జనార్దన్‌ కనుసన్నల్లో హైకోర్టుకు వెళ్లడంతో 23 వేల మందికి పట్టాలు పంపిణీకి బ్రేక్‌ పడింది.

రూ.350 కోట్లతో 28 వేల మందికి

ఇళ్ల పట్టాలు సిద్ధం చేసినా..

దామచర్ల జనార్దన్‌, టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిరా తీరాలన్న ధృడ సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసైనా ఇద్దామని భావించారు. అందులో భాగంగా శరవేగంగా రైతుల వద్ద 508 ఎకరాల భూముల కొనుగోలు చేసి రూ.350 కోట్లు కేటాయించి 28 వేల మందికి పట్టాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్‌ దగ్గర పడుతుండటంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా భరోసా పత్రాలు సైతం పంపిణీ చేశారు.

పేదల ఇళ్లపై దామచర్ల కక్ష

2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్‌ రెండున్నరేళ్లుగా పేదల ఇళ్ల పట్టాలపై కక్ష కట్టాడు. రకరకాల సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ రెండున్నరేళ్లలో ఒక్క లబ్ధిదారునికి ఇంటి పట్టా పంపిణీ చేసింది లేదు. కేవలం వైఎస్సార్‌సీపీకి మంచి పేరు వస్తుందన్న కారణంగానే దామచర్ల ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించకుండా అట కెక్కించారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. వైఎస్సార్‌ సీపీ హయాంలో రెవెన్యూ అధికారులు రేయింబవళ్లు కష్టపడి తయారు చేసిన ఇళ్ల పట్టాలు చెప్ప కుప్పల్లా మారిపోయాయి. నగరంలో వేలాది మంది ఇళ్ల పట్టాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

పోతురాజు పనుల్లో ఇంత జాప్యమా..

నగరంలోని ప్రధాన మురుగు బయటకు వెళ్లే పోతురాజు కాలువ ఆధునికీకరణ కోసం వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.98 కోట్లు కేటాయించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోతురాజు ఆధునికీకరణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వర్షాల సమయంలో ఈ పోతురాజు కాలువ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంత ప్రాధాన్యం ఉన్న ఈ కాలువ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పార్కులు, జిమ్‌ల అభివృద్ధికి రూ.10 కోట్లు

నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్‌ సీపీ హయాంలో సుమారు 30 పార్కుల అభివృద్ధికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పార్కుల్లో వాకింగ్‌ ట్రాక్‌లు, వ్యాయామ పరికరాలు, జిమ్‌ల ఏర్పాటు చేశారు.

పోతురాజు కాలువ సిమెంట్‌ వాల్‌ నిర్మాణ పనులు

అగ్రహారం వద్ద పేదల ఇళ్లకు సిద్ధం చేసిన జగనన్న కాలనీ లే అవుట్‌(ఫైల్‌)

మామిడిపాలెం సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ వద్ద ఏర్పాటు చేసిన జిమ్‌, వ్యాయామం షెడ్‌

కొప్పోలు నుంచి గుత్తికొండవారిపాలెం గ్రామం వెళ్ళే రహదారిపై నిర్మించిన బ్రిడ్జి

ఒంగోలు నగరానికి రూ.400 కోట్లతో మంచినీటి పథకం మంజూరు

చరిత్రలో నిలిచేలా 28 వేల ఇళ్ల పట్టాలిచ్చేందుకు 508 ఎకరాలు కొనుగోలు

ఇళ్ల పట్టాల కోసం వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.350 కోట్లు ఖర్చు

పోతురాజు కాలువ ఆధునికీకరణ కోసం రూ.98 కోట్లు కేటాయింపు

నగర ప్రజల ఆరోగ్యం కోసం, పార్కుల అభివృద్ధికి రూ.10 కోట్లు ఖర్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement