మాట్లాడుతున్న పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, పక్కన దర్శి ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఇతర నేతలు
హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
మార్కాపురం టౌన్:
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా సత్తా చాటి మెజారిటీ స్థానాలు కై వసం చేసుకునేలా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ పరంగా స్వపక్షం, ప్రతిపక్షం ఉంటుందని, ఆనాడు ఎవరి గౌరవం వారు కాపాడుకుంటూ రాజకీయాలు చేశారన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేనంత అరాచకపాలన చంద్రబాబు పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఏ పార్టీ వారైనా నామినేషన్ వేసేందుకు స్వతంత్య్రం ఉందని, కానీ రెడ్‌బుక్ పాలనలో కేవలం టీడీపీ నాయకులే నామినేషన్లు వేసుకోవడం, వచ్చిన అభ్యర్థులను ఆడ్డుకోవడం అరాచకమన్నారు. కార్యకర్తల కోసం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులపైనే దాడి చేసి తిరిగి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదుచేయడం అన్యాయమన్నారు. ప్రజాక్షేత్రంలో ఓటర్ల అభిప్రాయాలను స్వీకరించాలే తప్ప టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమనే భావనతో నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు, భౌతిక దాడులకు దిగిందన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించి టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.
ఓటమి భయంతోనే దాడులు..
దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాక్షస పాలన, వెన్నుపోటు పార్టీ సమయంలో కూడా వైయస్సార్‌సీపి తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భావనతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రస్తుతం వైయస్సార్‌సీపి నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, పార్టీ ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కుతో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ మార్కాపురం పురపాలక సంఘంలో 40 వార్డులకు గానూ 37 మంది వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, మాఫియాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఓటర్లకు ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా అమలు చేయకుండా కుంటిసాకులతో రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పుకోవడం వారికే చెల్లిందన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం రిజర్వు బ్యాంకుతోపాటు వివిధ సంస్థను షూరిటీగా పెట్టి లక్షల కోట్ల రూపాయలను అప్పుగా తెస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీకి మూల స్తంభం లాంటివారని, కార్యకర్త లేకపోతే పార్టీ లేదన్నారు. ఐదేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పాలనను, రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు నామినేషన్లు వేసేందుకు వెళ్లిన అభ్యర్థులపై దాడి చేయడంతో పాటు నామినేషన్ పత్రాలను చించివేయడం, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం టీడీపీకే చెల్లిందన్నారు. లక్షల కోట్ల రూపాయలను అమరావతిలో పెట్టుబడి పెట్టి వారి కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నారే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఘర్షణలకు అవకాశం ఇచ్చిన అధికారులను విడిచిపెట్టేది లేదన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కేవీ రమణారెడ్డి, వెన్న హనుమారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ చప్పల్లి కనకదుర్గ, మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, నారు బాపన్‌రెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, గుంటక వనజాక్షి, గొట్టం నర్సమ్మ, రోజ్‌లిడియా, ఫరతుల్లాబేగ్, కేవీరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా సత్తా చాటుదాం
వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి


