– 2లో..
నగరంలోని సమస్యలపై అవగాహన ఉంది ప్రజలకు అవసరమైనప్పుడు అండగా సేవలు చేపట్టా నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తా ఒంగోలు కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ విజ్ఞప్తి
ఒంగోలు టౌన్: ‘‘ఒంగోలు నగరంలోని ప్రతి మూల ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాను. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎందరికో సేవలు చేశాను. నన్ను గెలిపించండి...మీ రుణం తీర్చుకుంటాను’’ అని వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుప్పం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా నడవలేని పరిస్థితి ఉందని, నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నగరంలో నివశిస్తున్న నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు నివాస స్థలాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, పెరిగిపోయిన అద్దెలు చెల్లించలేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలాల పంపిణీకి కృషి చేస్తానని మాట ఇస్తున్నానని తెలిపారు. పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు చిన్న తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నగర ప్రజలకు ఆటవిడుపు కోసం ఎమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని మనవి చేశారు. సమావేశంలో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఈసీ మెంబర్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్వరరావు, కె.రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు.


