అధికార పార్టీకి తొత్తులుగా మారి అరాచకం ఎమ్మెల్యే ఉగ్ర కనుసన్నల్లోనే పచ్చ మూకల దాడి కర్రలు, రాళ్లతో 200 మంది టీడీపీ రౌడీలు నామినేషన్ కేంద్రంలోనే ఉన్నారు ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకుంటాం పచ్చ రౌడీలకు రిటన్ గిఫ్ట్ ఇస్తాం కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ హెచ్చరిక
కనిగిరి/పీసీపల్లి: ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేమనే దురుద్దేశంతో టీడీపీ నేతలు పచ్చచొక్కాలు వేసుకున్న పోలీసులను అడ్డుపెట్టుకుని దాష్టీకానికి తెగబడ్డారని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా సోమవారం టీడీపీ రౌడీల దౌర్జన్యాన్ని ఖండిస్తూ అధికారులు, పోలీసుల తీరును ప్రశ్నిస్తూ నామినేషన్ కేంద్రం అయిన మున్సిపల్ ఆఫీసు వద్ద సోమవారం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతిరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు.
కనిగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డిని ప్రకటించడంతో కూటమి నేతలు సగం ఓడారని, నామినేషన్ ర్యాలీని చూసి పూర్తిగా ఓడిపోయారన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం రోజు నుంచే ఎన్నికల అధికారులు, పోలీసులు అరాచకానికి పాల్పడుతున్నారని, అధికారపార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. నామినేషన్ల దరఖాస్తు చివరి రోజు 8 నామినేషన్ల పత్రాలను అధికారుల చేతుల్లో నుంచి లాక్కుని పచ్చ గుండాలు చించేశారని తీవ్రంగా మండిపడ్డారు.
ఎమ్మెల్యే ఉగ్ర కనుసన్నల్లోనే పచ్చ మూకల దాడులు:
టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి కనుసన్నల్లోనే సుమారు 200 మంది రౌడీలను, అందులో 15 మంది మహిళలను లోపల పెట్టి నామినేషన్ పత్రాలు వేసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేసి లాక్కుని చించారని దద్దాల మండిపడ్డారు. పరిశీలన రోజు కూడా లోపలికి రానివ్వకుండా దౌర్జన్యం చేశారని, బీహార్‌ను తలదన్నేలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోందన్నారు. రెండేళ్లలో మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకుని ప్రజా క్షేత్రంతో గెలవాలేకానీ ఓటమి భయంతో బరితెగింపు చర్యలకు పాల్పడటం దిగజారుడుతనమన్నారు. టీడీపీ రౌడీలు సృష్టించిన అరాచకాన్ని, దౌర్జన్య కాండను ప్రతి అంశాన్ని వీడియోలు చిత్రీకరిస్తున్నామని, కాలం అన్నీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. పచ్చ రౌడీలకు తప్పక రిటన్ గిఫ్ట్ ఇస్తామని దద్దాల హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ మహిళా అభ్యర్థులను కొట్టారని కొందరు ఆస్పత్రిలో చేరారని చెప్పారు. మున్సిపల్ ఆఫీసును పచ్చమూకల ఆఫీసుగా మార్చిన ప్రతి పోలీసు అధికారి, ఎన్నికల అధికారుల జాబితా సిద్ధం చేశామని, వాటిని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పంపిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వారంతా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి. కనిగిరిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, 32 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ఏడిపించిన వారిని ఎవరినీ వదిలిపెట్టమన్నారు. పచ్చ నేతల దుర్మార్గాలకు భయపడేది లేదని, ధైర్యంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గ చర్యలను ఎన్నికల ఉన్నతాధికారులకు, పోలీసుల ఉన్నతాధికారులకు చెప్పినా కనీసం లోపలికి వెళ్లనివ్వలేదని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు దద్దాల చెప్పారు.
పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నారు:
పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీ ఎమ్మెల్యే, కూటమి నేతల ఆదేశానుసారం పనిచేస్తున్నారని డాక్టర్ దద్దాల ధ్వజమెత్తారు. పోలీసుల అధికారుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాక్కున్నా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోపలికి వెళ్లిన అభ్యర్థుల పత్రాలను బలవంతంగా లాక్కున్నారని, కొట్టేందుకు తరుముకున్నారని, అభ్యర్థులు భయంతో బయటకు వచ్చారన్నారు. పోలీసులు ఉండి కూడా ఆవైపు వెళ్లడం లేదని, కనీసం అభ్యర్థులకు రక్షణ కల్పించడం లేదన్నారు.
పత్రికా స్వేచ్ఛను కాలరాశారు:
కూటమి నేతలు, అధికారులు కలిసి పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కనీసం ఎన్నికల కేంద్రంలో సమాచార సేకరణ, వీడియోల చిత్రీకరణ కూడా చేయకుండా విలేకర్లపై ఆంక్షలు పెట్టి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొందరు విలేకర్ల సెల్‌ఫోన్లను కూడా టీడీపీ గూండాలు లాక్కున్నారని, పోలీసులు, అధికారులు చూసి కూడా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతిరెడ్డి, సిరుప వెంకట గోవర్ధన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గఫార్, మాజీ ఏఎంసీ చైర్మన్ చింతగుంట్ల సాల్మన్, మాజీ జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, నాయకులు జీ ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, వాకుమళ్ల రాజశేఖరరెడ్డి, డాక్టర్ నాయబ్ రసూల్, ఆయిమల్ల నాగమణి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, పులి రాధాకృష్ణారెడ్డి, సూరసాని నరసారెడ్డి, జీ బొర్రారెడ్డి, ఓకే రెడ్డి, పార్టీ వివిధ విభాగాల నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, పట్టణ నాయకులు తదితరులున్నారు.


