హెచ్‌ఐవీపై అవగాహనకు 5కే రెడ్‌ రిబ్బన్‌ పరుగు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహనకు 5కే రెడ్‌ రిబ్బన్‌ పరుగు

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

మార్కాపురం: యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు అపోహలు తొలగించేందుకు జిల్లా స్థాయి 5కే రెడ్‌ రిబ్బన్‌ పరుగు బుధవారం మార్కాపురంలో నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యూపీహెచ్‌సీ కోర్టు సెంటర్‌ నుంచి ప్రారంభమైన పరుగు బస్టాండ్‌ మీదుగా ఎల్వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ వరకు సాగి తిరిగి కోర్టు సెంటర్‌కు చేరుకుంది. ఈ 5కె రన్‌ను కలెక్టర్‌ ఎం.విజయ సునీత జెండా ఊపి పరుగు పందేన్ని ప్రారంభించారు. జిల్లాలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన 123 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై శాసీ్త్రయ అవగాహన ఎంతో అవసరమన్నారు. హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, చికిత్స తదితర అంశాలపై సరైన సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు సమాజంలో ఉన్న అపోహలు తొలగించేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. పురుషుల విభాగంలో ఎ.సాంబశివరావు ప్రథమ స్థానంలో నిలిచి 10 వేల రూపాయల నగదు బహుమతి అందుకోగా విజయరాజు నాయక్‌ ద్వితీయ స్థానంలో నిలిచి 7 వేల రూపయల బహుమతి పొందారు. మహిళల విభాగంలో ఈశ్వర వైభవలక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి 10 వేల రూపాయలు, గాయత్రి ద్వితీయ స్థానంలో నిలిచి 7 వేల రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. విజేతలకు కలెక్టర్‌ చేతుల మీదుగా నగదు బహుమతులు, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్‌ కె.రాహుల్‌ మాట్లాడుతూ యువతకు హెచ్‌ఐవీపై సరైన అవగాహన కల్పించడం ద్వారా అపోహలు తొలగించి వ్యాధి నివారణపై సామాజిక చైతన్యం తీసుకురావచ్చన్నారు. విద్యార్థులు ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు తమకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేయాలని సూచించారు. మార్కాపురం ఏఆర్‌టీ సెంటర్‌ వైద్యులు డాక్టర్‌ సాయి కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై యువతలో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదపడవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు హరీష్‌, సాయి చరణ్‌తేజ, శివారెడ్డి, దిశ సీపీఎం అమీన్‌ సాహెబ్‌, సీఎస్‌ఓ సాయి, పోతురాజు, కోటేశ్వరరావు, రామారావు, మురళి, పి.రాజు, వివిధ పాఠశాలల పీటీలు పాల్గొన్నారు.

ర్యాలీని ప్రారంభించిన

కలెక్టర్‌ విజయ సునీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement