గిద్దలూరు రూరల్: మండలంలోని గడికోట గ్రామ పంచాయతీ విఠాముసురుపల్లె గ్రామానికి చెందిన కాశమ్మ అనే వితంతు మహిళ తనను రక్షించే దిక్కు లేదని, ఊరు వదిలి వెళ్తున్నానంటూ బుధవారం పోలీసుస్టేషన్ వద్ద వాపోయింది. తనకు గ్రామంలో నిర్భయంగా ఉండేందుకు పోలీసులు భరోసా ఇవ్వడం లేదని, దీంతో తాను బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకునేందుకు వెళ్తున్నానని వాపోయింది. ఈ నెల 11వ తేదీ అదే గ్రామానికి చెందిన ఎలక నాయుడు అనే వ్యక్తి మద్యం తాగి మత్తులో తనపై అకారణంగా ఘర్షణకు దిగి తన పొలంలోకి దారి లేదంటూ కర్రతో చెయ్యి విరగొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో అతడిపై కేసు నమోదు చేశారన్నారు. విరిగిన చెయ్యిని బాగు చేయించుకునేందుకు నంద్యాలలోని వైద్యశాలకు వెళ్లి కట్టు కట్టించుకుని వచ్చినట్లు చెప్పింది. తిరిగి గ్రామంలోకి వెళ్లాలంటే భయంగా ఉందని, తనపై పోలీసు కేసు పెడతావా..ఎలా ఊర్లో తిరుగుతావో చూస్తానంటూ ఎలక నాయుడు బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేశామంటూ చేతులు దులుపుకున్నారని పేర్కొంది. మద్యం తాగి దౌర్జన్యంగా కర్రతో చెయ్యి విరగొట్టిన్నప్పటికీ పోలీసులు అతడిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఆమె జోలికి వెళ్లొద్దని ఎలక నాయుడిని పల్లెత్తు మాట అనకపోవడం వల్లే అతడు తిరిగి తనపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని వాపోయింది. గ్రామంలో నివాసం ఉండాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు చొరవ చూపి తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని బాధితురాలు కోరుతోంది.
మహిళకు రక్షణ కరువు


