తనిఖీలు.. చర్యలేవీ?
కందుకూరులో ఎస్సీలను బెదిరించి భూములు లాక్కొని..
నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు
ఉలవపాడులోని భారీ వెంచర్‌కు తరలింపు
నెల్లూరుకు చెందిన టీడీపీ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో దందా
ప్రభుత్వానికి సీనరేజ్ రూపంలో కోట్ల రూపాయల నష్టం
అధికారుల మొక్కుబడి తనిఖీలపైనా ఆరోపణలు
గ్రావెల్ మాఫియా ఆగడాలతో పక్కన పొలాలు ప్రమాదం
ఓగూరు పొలాల్లో అక్రమ తవ్వకాలకు సిద్ధంగా ఉన్న మూడు భారీ జేసీబీలు
గ్రావెల్ టిప్పర్ల రవాణాతో ఆ ప్రాంతంలో ఏర్పడిన రోడ్డు
ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు సాగించిన దృశ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కందుకూరు మండల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మండల సరిహద్దుల్లోని జామాయిల్ సాగు పొలాల నుంచి గ్రావెల్‌ను భారీ వాహనాలతో తవ్వి తరలిస్తున్నారు. ఉలవపాడు మండల పరిధిలోని 349 నుంచి 354 సర్వే నంబర్లలో సుమారు 82.50 ఎకరాల్లో 956 ప్లాట్లతో వేసిన భారీ వెంచర్‌కు మట్టిని తరలిస్తున్నారు. వెంచర్‌లో లెవలింగ్ పనుల కోసం భారీగా గ్రావెల్ తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో టిప్పర్‌కు సుమారు రూ.5 వేల వరకు చెల్లిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా అనుమతులు ఉన్నాయా? ఎంత పరిమాణంలో గ్రావెల్ తవ్వారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
వెంచర్ పనులపై పోటీ?
వెంచర్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పలువురు స్థానిక నాయకులు పోటీ పడ్డారని తెలుస్తోంది. చివరకు నెల్లూరు ప్రాంతానికి చెందిన కొందరికి మౌలిక వసతుల పనులు దక్కినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. లెవలింగ్ పనులను కందుకూరు ప్రాంతానికి చెందిన ఏ1 కాంట్రాక్టర్ దక్కించుకున్నట్టు తెలిసింది. ఒక గ్రావెల్ టిప్పర్ రూ.5 వేల చొప్పున తోలుతున్నారని సమాచారం. కందుకూరు మండల నాయకులతో పాటు సింగరాయకొండ మండల టీడీపీ నాయకులు కూడా గ్రావెల్ మాఫియాలో ఆరితేరారు. దీంతో ఈ వెంచర్‌కు గ్రావెల్ సరఫరాకు సింగరాయకొండ నాయకులు కూడా పోటీపడ్డారని అయితే వీరు ఉలవపాడుకు గ్రావెల్ తోలాలంటే ఒక టిప్పరుకు సుమారు రూ.1,500 అదనంగా కందుకూరు నియోజకవర్గ నాయకులకు కప్పం కట్టాల్సి ఉండడంతో వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి తరలిస్తుండడంతో ప్రభుత్వానికి సీనరేజ్ రూపంలో రావాల్సిన రూ. కోట్ల నగదు జమకావడం లేదు.
భయపెట్టి భూముల కొనుగోలు:
వెంచర్‌కు అవసరమైన మట్టి తవ్వకాలకు కందుకూరు మండలంలోని ఎస్సీల భూములపై అధికార పార్టీకి చెందిన నేతల కన్ను పడింది. వెంచర్ అభివృద్ధి పనులు దక్కించుకున్న ఏ1 కాంట్రాక్టరు ఎస్సీల భూములను బలవంతంగా తక్కువ ధరకు తీసుకుంటున్నాడని, ఎస్సీలు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారని సమాచారం. సదరు భూముల్లో ఇప్పటికే 7 నుంచి 10 అడుగుల వరకు తవ్వకాలు జరుపుతున్నారని చెబుతున్నారు. భారీగా తవ్వకాలు చేస్తే చుట్టుపక్కల వ్యవసాయ భూములపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితులపై ప్రభావం పడితే భవిష్యత్తులో తమ పొలాలు కూడా సాగుకు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి
గ్రావెల్ తవ్వకాలకు అవసరమైన అనుమతులు, పర్యావరణ నిబంధనలు, వ్యవసాయ భూముల వినియోగంపై నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత శాఖలు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తవ్వకాల వల్ల వ్యవసాయ భూములకు నష్టం కలిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తనిఖీల తర్వాత అసలు పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది.
అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఫిర్యాదులు రావడంతో మైనింగ్ అధికారులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు స్థానికులు తెలిపారు. అక్కడ జేసీబీలు ఉన్నప్పటికీ తవ్వకాల పరిమాణాన్ని పూర్తిస్థాయిలో కొలవలేదని, తనిఖీలు మొక్కుబడిగా సాగాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు ఏం గుర్తించారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారుల తనిఖీలతో గురు, శుక్రవారాల్లో తవ్వకాలు నిలిచిపోయినట్లు తెలిసింది. టిప్పర్లు రహదారి పక్కన నిలిపి ఉంచినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అన్నది తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఎస్సీల దగ్గర నుంచి బలవంతంగా భూములు తక్కువ ధరలకే సొంతం చేసుకుని ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. కందుకూరు మండలంలో తవ్విన మట్టిని ఉలవపాడు వద్ద అక్రమంగా వేసిన భారీ వెంచర్‌కు తరలిస్తున్నారు. రేయింబవళ్లు భారీ వాహనాలతో తవ్వకాలు చేస్తూ సహజ వనరుల్ని కుళ్లబొడిచేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 టిప్పర్లలో తరలించేస్తున్నారు. రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ గలీజు దందాకు పాల్పడుతోంది అధికార పార్టీకి చెందిన పెద్దలు కావడంతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. గురు, శుక్రవారాల్లో అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


