మార్కాపురం: కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ పిలుపు మేరకు 9వ రోజున నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో మార్కాపురంలో అన్ని కేడర్ సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు శాంతియుత నిరసన నిర్వహించారు. 2014 తర్వాత నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, వైద్యఆరోగ్య శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కోల్పోయిన 100 శాతం జీతాన్ని తిరిగి అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు చనిపోతే రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరస్పర అంగీకార బదిలీలు, ఆప్షన్ బదిలీలు కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు శివకృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, తిరుపతయ్య, రవిశేఖర్‌రెడ్డి, అనూష, సత్య, అనిల్, జాన్సీ, బాను, అర్షియ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో రెండవ రోజూ రాష్ట్ర మంత్రులు బృందం ఫీడర్ కెనాల్ ప్రాంతంలో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరి నారాయణ, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు ఫీడర్ కెనాల్‌ను పరిశీలించారు. కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్దన్‌రాజుతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
సీఎం పర్యటన ఏర్పాట్లపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం
మార్కాపురం టౌన్: ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేల సమీక్ష శనివారం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఆర్‌ఐఓ, డీఐఈఓ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి.రాజేంద్రబాబు శనివారం కలెక్టర్ పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.


