పంచాయతీరాజ్‌ డీఈఈ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌ డీఈఈ వేధింపులు

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

ఒంగోలు సబర్బన్‌:

భివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు చేయించకుండా పంచాయతీరాజ్‌ డీఈఈ కే కృష్ణమోహన్‌ వేధిస్తున్నాడంటూ సంతనూతలపాడు జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ సోమవారం కలెక్టర్‌ పి.రాజాబాబుకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండల పరిషత్‌ వర్క్స్‌ కమిటీ చైర్మన్‌ కే రమణతో కలిసి ఒంగోలులోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్‌ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ వర్క్స్‌ కమిటీ తీర్మానాలిచ్చినా బిల్లులు చేయకుండా డీఈఈ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కలెక్టర్‌కు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా పరిషత్‌కు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా పంచాయతీరాజ్‌ డీఈఈ కృష్ణమోహన్‌, ఇంజినీరింగ్‌ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు, పూర్తి కావాల్సిన పనులకు దాదాపు రూ.80 లక్షల వరకు ఎంబీ రికార్డు చేయకుండా పెండింగ్లో పెట్టి ఇబ్బందులు కలిగిస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. గతంలో తాను సంతనూతలపాడు పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న కాలంలో కూడా దాదాపు రూ.60 లక్షల నిధులకు సంబంధించిన పనులు పూర్తి చేసినప్పటికీ రికార్డు చేయకుండా, బిల్లులు రాకుండా నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆ నిధులకు సంబంధించి 2011వ సంవత్సరంలో ఏపీ హైకోర్టులో కేసు వేసినా.. బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించినా నేటికీ పెడచెవినపెట్టి వేధిస్తున్నారన్నారు. హైస్కూలు, మండల కాంప్లెక్స్‌లోని భవనాల ప్రారంభోత్సవ సమయంలో వివిధ రకాల నిర్మాణాలు, రోడ్ల పనుల బిల్లులు, జగనన్న కాలనీలో కల్వర్టులు, రోడ్ల బిల్లులు చేయాల్సి ఉందన్నారు. ఒక్క సంతనూతలపాడులోనే దాదాపు రూ.80 లక్షల విలువైన పనులు ఇంకా చేయాల్సినవి మిగిలి ఉన్నాయన్నారు. గతంలో ఇతనిపై కేసు వేశామనే అక్కసుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇబ్బందిపెడుతున్నాడని కలెక్టర్‌కు వివరించారు. డీఈఈ కృష్ణమోహన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు గ్రామ పంచాయతీ తీర్మానాలు, వర్క్‌ ఆర్డర్లు ఇప్పించి పూర్తి చేయించాలని కలెక్టర్‌కు దుంపా రమణమ్మ విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు చేయించకుండా ఇబ్బందులు

మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్‌ రాజాబాబు

అర్జీదారులను కార్యాలయాల చుట్టూ

తిప్పుకోవద్దు : కలెక్టర్‌ రాజాబాబు

సమస్యల పరిష్కారం కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్‌ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, డీఆర్‌ఓ రమణ, ఆర్డీఓ చంద్రశేఖర్‌ నాయుడు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రీవెన్స్‌ అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యమన్నారు. బలహీనవర్గాల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని చెప్పారు. రెవెన్యూయేతర సమస్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్‌ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌ ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున ప్రజలతో వ్యవహరించే విధానం, సమస్యలను పరిష్కరిస్తున్న పద్ధతి సక్రమంగా ఉండాలన్నారు. గ్రీవెన్స్‌ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తెరిగి అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులందరూ ప్రతిరోజూ ముందుగా ఆన్‌లైన్‌లో గ్రీవెన్స్‌ అర్జీల స్టేటస్‌ గమనించాలని కలెక్టర్‌ చెప్పారు. సాంకేతిక కారణాల వలన పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement