ఆర్యవైశ్యులపై పెరుగుతున్న దాడులు | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులపై పెరుగుతున్న దాడులు

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

ఆర్యవైశ్యులపై పెరుగుతున్న దాడులు

ప్రభుత్వంలో ఉన్న ఆర్యవైశ్య పెద్దలు చోద్యం చూస్తున్నారు అక్రమాలకు నిలయంగా ఆర్యవైశ్య మహాసభ రానున్న రోజుల్లో ప్రతిఘటన తప్పదు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 25 నెలల్లో వ్యాపారులు దెబ్బతిన్నారు..రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ అధ్యక్షతన ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సమ్మేళనం నిర్వహించారు. అంతకు ముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్సార్‌ విగ్రహానికి, పొట్టి శ్రీరాములు, గాంధీజీ, వైఎస్సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని, వ్యాపారులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు ఎక్కువయ్యాని ఆయన ధ్వజమెత్తారు. ఆర్యవైశ్యులపై రౌడీషీట్లు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే అందరిపైనా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే ఆర్యవైశ్యులకు మేలు..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు ఎంతో మేలు జరిగిందని వెల్లంపల్లి చెప్పారు. మొన్నటి వరకూ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య మహాసభ అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సైతం అవినీతి రాజ్యమేలడం దురదృష్టకరమన్నారు. ఈ మహాసభలో పోస్టు కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసు కావాలి, అలాగే రూ.లక్షలు డిమాండ్‌ చేస్తుండడం దుర్మార్గమన్నారు. నేడు నిర్మితమవుతున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు వ్యాపారులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్యవైశ్య మహాసభకు నామినేషన్‌ వేస్తే కేసు, ఈ ప్రభుత్వం కేసులు పెట్టడం తప్ప చేసిన మేలు ఏమీ లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కాణిపాకం నుంచి అరసవిల్లి వరకూ ప్రతి దేవస్థానం కమిటీలో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ, కనక దుర్గమ్మ, ద్వారకా తిరుమల పాలకమండలి కమిటీల్లో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. ప్రముఖ దేవస్థానాల కమిటీ పాలకమండళ్లలో సభ్యులుగా ఆర్యవైశ్యులు పనికిరారా అని ఆయన ప్రశ్నించారు. తమను ఓటు బ్యాంకుగానే కూటమి చూడడం దారుణమన్నారు. అలాగే ఒక్క నామినేటెడ్‌ పోస్టు కూడా ఇవ్వకపోవడం సరికాదని, దీనిపై కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆర్యవైశ్యులపై దాడులు, అక్రమ కేసులు:

ఇదే జిల్లా పొదిలికి చెందిన అవినాష్‌ అనే వ్యాపారస్తుడు లారీని రోడ్డుపై పెట్టాడని ఎస్‌ఐ చితకబాదాడు, అప్పుడు ఆ ఘటన వివాదాస్పదం కావడంతో మూడు రోజులు వీఆర్‌కు పంపి వెంటనే మార్కాపురంలో పోస్టింగ్‌ ఇవ్వడం దారుణమన్నారు. పొట్టిశ్రీరాములు ట్రస్ట్‌లో పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఆర్యవైశ్యులను ప్రభుత్వం చులకన భావంతో చూస్తోందని ధ్వజమెత్తారు. దాడులు చేయడం, హింసించడం, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం చేస్తోందని విమర్శించారు. ఆర్యవైశ్యులు భయపడే రోజులు పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరుతో చాలా మంది వ్యాపారులు వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అసలే ఆర్థికంగా కష్టాలు పడుతున్న వారిపై వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వంలోని ఆర్యవైశ్య దద్దమ్మలు ఏం చేస్తున్నారని, ఇలా దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు.

ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం..

కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను అధికార పార్టీలో ఉన్న ఆర్యవైశ్య పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నారాంబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్యవైశ్యుల్లో చైతన్యం వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

ఆర్యవైశ్య మహాసభ పార్టీలకతీతంగా

నడవాలి..

కూటమి ప్రభుత్వ హయాంలో రెండేళ్లుగా ఆర్యవైశ్యులపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ మండిపడ్డారు. కూటమి పార్టీలోని ఆర్యవైశ్య పెద్దల తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు ఈ సభకు వచ్చిన అనూహ్య స్పందనే నిదర్శనమన్నారు. ఆర్యవైశ్య మహాసభలో పదవులు కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ నడవాలని, లేని పక్షంలో వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆర్యవైశ్యులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని, వారికి అన్ని సమయాల్లో అండగా నిలుస్తానని వైఎస్సార్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులను మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గుబ్బా చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మోసపోయారో అదే విధంగా ఆర్యవైశ్యులు దగా పడ్డారని ఆర్టీఐ మాజీ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్‌ ఆరోపించారు. ఆర్యవైశ్యులను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. తనపై ఎలాంటి నేరపూరిత కేసులు లేకపోయినా రౌడీషీట్‌ పెట్టారని ఆయన ఆరోపించారు. ఆర్యవైశ్యులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు మిట్ట కరుణాకర్‌, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్‌, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మోటామర్రి సదానందం, కోటప్పకొండ దేవస్థానం మాజీ బోర్డు మెంబరు దివ్వెల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ఆర్యవైశ్యులు

మాట్లాడుతున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement