దీక్షకు పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా.. రైతుల అనుమతి ఉంది సోమవారం వస్తే చాలు నిరసనలతో దద్దరిల్లుతున్న కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు: చెవిరెడ్డి చంద్రబాబుది దోపిడీ పాలన : కాకాణి పొగాకు రైతులకు నీ తాత సొమ్మేమన్నా ఇస్తున్నావా చంద్రబాబు : బూచేపల్లి దళారీ అవతారమెత్తి పొగాకు రైతును దోచుకుంటున్న ప్రభుత్వం : తాటిపర్తి పొగాకు రైతులకు మద్దతుగా ఢిల్లీలో ఆందోళన చేస్తాం : ఆదిమూలపు పొగాకు కంపెనీలకు అమ్ముడుపోయిన ప్రభుత్వం : మేరుగు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై పొగాకు రైతు దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకుల విమర్శలు
రైతుల పక్షాన
ఒంగోలు టౌన్/ఒంగోలు సిటీ: వేలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పొగాకు రైతులను ఆదుకోలేక చంద్రబాబు ప్రభుత్వం తన అసమర్ధతను నిరూపించుకుందని వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. పొగాకు రైతుల దీక్షలకు పోలీసులు అనుమతివ్వలేదని, కానీ ప్రజలు, పొగాకు రైతుల అనుమతి ఉందన్నారు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏం చేసుకుంటావో చేసుకోమని భారీ ఎత్తున పొగాకు రైతులు నేరుగా కలెక్టరేట్ వద్దకు వచ్చి దీక్షలో పాల్గొన్నారని, ఇది రైతుల ఆగ్రహానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సోమవారం వస్తే చాలు కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు ప్రజలు, రైతుల నిరసనలతో దద్దరిల్లి పోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ అసమర్ధ పాలనపై ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు వివిధ రీతుల్లో ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పొగాకు రైతులు, గ్రామీణ ప్రజలు ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను వేధించిన ఉద్యోగులను రిటైర్డ్ అయినా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి కేసులు పెడతామని హెచ్చరించారు.
రైతులను మోసం చేసిన చంద్రబాబు: కాకాణి
రాష్ట్రంలోని రైతులకు యూరియా ఇప్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు అనతికాలంలోనే 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఘనుడని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విరుచుకు పడ్డారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత 45 నెలల పాటు కనిపించకుండా పోయిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో బయటకు వచ్చాడని, కానీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే ప్రజల మధ్యకు వచ్చి పోరాడుతున్నారని కితాబిచ్చారు. రైతులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మట్టి, ఇసుక, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ మార్చడం వంటి దోపిడీ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. 99 పైసలకే ఎకరం భూములిస్తున్న కూటమి ప్రభుత్వం లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ అవసరమైతే ఊరికే ఇస్తానంటున్నాడని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో ప్రజలకు ఉపయోగపడేలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థలను నిర్మిస్తే జగనన్న సృష్టించిన ఆస్తులను చంద్రబాబు దోచుకుంటున్నాడని, రామాయపట్నం పోర్టు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమన్నారు.
రాష్ట్రంలో సిండికేట్ పాలన: తాటిపర్తి చంద్రశేఖర్
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నడవడంలేదని, సిండికేట్ల పాలన నడుస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విరుచుకుపడ్డారు. వాళ్లే వ్యాపారాలు చేస్తున్నారని, వాళ్లే లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే దళారి అవతారమెత్తి ప్రజల్ని లూఠీ చేస్తోందని మండిపడ్డారు. డీఆర్సీ మీటింగులో మాట్లాడడానికి లేచిన వెంటనే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కెమెరాలను ఆపించి మీడియాను బయటకు పంపించారని ఆరోపించారు. చేసేది తప్పుడు పనులు కనుక తామెక్కడ ప్రశ్నిస్తామోనన్న భయంతో మీడియాను బయటకు పంపించారని తెలిపారు. పరిపాలన చేతకాక పోలీసులను ప్రయోగిస్తున్నారని, బూడిద పార్టీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు.
చంద్రబాబుకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనలేదు: ఆదిమూలపు
చంద్రబాబుకు పొగాకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనలేదని, ఆయన హృదయం పాషాణమని మాజీ మంత్రి, కొండపి ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమమన్నా, ప్రజా సంక్షేమ పథకాలన్నా చంద్రబాబు వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేస్తే రైతులు ఇబ్బందుల నుంచి బయటపడతారని తెలిపారు. పొగాకు రైతుల కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు.
కంపెనీలకు అమ్ముడుపోయిన చంద్రబాబు: మేరుగు నాగార్జున
చంద్రబాబు ప్రభుత్వం కంపెనీలకు అమ్ముడుపోయి పొగాకు రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగు నాగార్జున విమర్శించారు. పొగాకును అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేస్తుంటే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ దాచుకున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో క్వింటా పొగాకు రూ.36 వేలు ఉంటే నేడు చంద్రబాబు పాలనలో రూ.16 వేలకు పడిపోయిందన్నారు. పొగాకు రైతుల గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలను దొంగలంటూ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.
పొగాకు రైతుల గురించి మాట్లాడితే దొంగలంటారా: చుండూరి
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల గురించి దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దొంగమాటలు మాట్లాడుతున్నారని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఖండించారు. పొగాకు రైతులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి ఎమ్మెల్యేలు వెళితే చంద్రబాబు సొరుగులోంచి పుస్తకాలు తీసి వారి చరిత్ర చెబుతున్నారని, చంద్రబాబు జనాల్నే కాదు సొంతపార్టీ ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడితే దొంగలంటున్నారని, ఎవరు దొంగలో ప్రజలకు బాగా తెలుసన్నారు.
ఆర్‌బీకేలతో రైతులకు మేలు చేసిన జగన్ : నాగార్జున రెడ్డి
రైతును రాజును చేయాలని మహానేత రాజశేఖర్ రెడ్డి కలలుకన్నారని, ఆయన ఆశయాల మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌బీకేలు తీసుకొచ్చారని గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కె.నాగార్జున రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను కనీసం మనిషిగా కూడా చూడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు.
పొగాకు రైతులను పట్టించుకోని పాలకులు: దద్దాల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. 2025లో బ్యారన్‌కు 37 క్వింటాళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.16 వేలకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. రైతుల వద్ద పొలం లేకుండా చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
పొగాకు బోర్డుకు బాధ్యత లేదా: బత్తుల
పొగాకు రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన పొగాకు బోర్డు ఏం చేస్తోందని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. రైతుల నుంచి వందలాది కోట్ల రూపాయలు సెస్ చేయడమేనా బోర్డుపని అని నిలదీశారు. కేంద్రానికి కోట్లాది రూపాయల విదేశీమారక ద్రవ్యం తీసుకొస్తున్న పొగాకు రైతుల పట్ల నిర్లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పనికిరాదని హితవు పలికారు.
ఈ నిరసన దీక్షలో రైతు నాయకులు రాయపాటి అంకయ్య, బొడ్డు కోటేశ్వరరావు, విజయ భాస్కర్‌రెడ్డి, చింతపల్లి హరి, సుల్తాన్, బి.కోటేశ్వరరావు, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవ ప్రసాద్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బంగారు బాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కొత్తపట్నం మండలాధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు పార్టీ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, సంతనూతలపాడు పార్టీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహగౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రా రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు సీఎం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ గోనుగుంట్ల రజనీ, గాయం సావిత్రి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, కిరీటి, దాసరి కరుణాకర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్, ఖాదర్ బాషా, పోలవరపు శ్రీమన్నారాయణ, మలిశెట్టి దేవా, మీరావలి, వెంకటేశ్వర్లు, గున్నా అమర్, గౌతం అశోక్, సన్నీ, శ్రీకాంత్, శోభాలత, షేక్ రషీద, ధర్నాసి హరిబాబు, పమిడి వెంకటేశ్వర్లు, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ తాత సొమ్ము ఇస్తున్నావా చంద్రబాబు: బూచేపల్లి
పొగాకు రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లు మంజూరు చేయడం లేదని, రైతులకు మీ తాత సొమ్ము ఇస్తున్నారా అని దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. పొగాకు సాగుకు బ్యారన్‌కు లక్షలాది రూపాయల ఖర్చు వస్తుందని, క్వింటా రూ.20 వేలకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం అన్యాయమన్నారు. క్వింటా పొగాకు రూ.20 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినా అధికారులు, కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదంటే ఆ పదవికి చంద్రబాబు అనర్హుడని తేల్చి చెప్పారు. జగనన్న పాలనలో క్వింటా రూ.36 వేలకు కొనుగోలు చేశారని, పొగాకు రైతులు ఎంతో ప్రయోజనం పొందారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు మద్దతుగా నిలబడితే రైతులను రెచ్చగొడుతున్నారని కూటమి పాలకులు విమర్శలు చేయడం దారుణమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పొగాకు రైతులకు అండగా నిలబడతానని, అవసరమైతే జిల్లాకు జగన్‌ను తీసుకొస్తామని చెప్పారు.
మా కుటుంబంపై అక్రమ కేసులు: బూచేపల్లి వెంకాయమ్మ
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బూచేపల్లి కుటుంబం మీద అక్రమంగా కేసులు బనాయించడం మామూలై పోయిందని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, మహానేత వైఎస్ కుటుంబంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగనన్న దమ్మున్న సీఎంగా పేరు తెచ్చుకున్నారన్నారు. పొగాకు రైతుల కోసం వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు.


