పోర్టు ప్రైవేట్‌పరాన్ని అడ్డుకునేందుకు ఎంతటి ఉద్యమానికై నా సిద్ధం ప్రైవేటీకరణతో భూములిచ్చిన రైతులు, స్థానిక యువతకు తీవ్ర అన్యాయం రూ.5 వేల కోట్లు విలువైన పోర్టును కేవలం రూ.1500 కోట్లకు తెగనమ్మేందుకు కూటమి సర్కార్ కుట్ర పోర్టును కాపాడుకునేందుకు నేడు జరిగే వైఎస్సార్ సీపీ ధర్నాను విజయవంతం చేయాలి బుర్రా మధుసూదన్‌యాదవ్
కందుకూరు: రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరరించుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.4,929 కోట్ల ఖర్చుతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు పోర్టు పనులు పూర్తి చేశారన్నారు. పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారని, దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాటు పోర్టు పనులను మూలనపడేసిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేసి పోర్టును ప్రారంభించలేకపోయారని ఆరోపించారు రూ.5 వేల కోట్లు విలువ చేసే పోర్టును కేవలం రూ.1500 కోట్లకు కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏపీ మారిటైం బోర్డు బిడ్లు పిలవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని, పోర్టు నిర్మాణానికి తీసుకున్న రూ.2079 కోట్లను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు.
రూ.1కే లీజు:
ప్రైవేట్‌పరం చేసేందుకు జారీ చేసిన టెండర్లలో పెట్టిన నిబంధనలు దారుణంగా ఉన్నాయని, రెండో దశలో పోర్టు అభివృద్ధికి కేవలం రూ.1కే లీజు అప్పగించడం, పోర్టులో ప్రభుత్వ ఈక్విడిటీ కేవలం 12 శాతం మాత్రమే ఉండడం దారుణమని బుర్రా మండిపడ్డారు. ఇప్పటికే బీపీసీఎల్ కంపెనీ పోర్టులో ఒక బెర్తును రిజర్వ్ చేసుకుందని, మరోపక్క పోర్టు పక్కనే ఇండోసోల్ పరిశ్రమ భారీ సోలార్ ప్యానల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి కీలకమైన పోర్టు పరిధిని తగ్గించి, విస్తరణ, నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వెనుక ఎంత దారుణమైన కుట్ర దాగి ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే గారు.. ప్రజలకు వాస్తవాలు చెప్పండి
రామాయపట్నం పోర్టు విషయంలో వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలను వల్లె వేస్తూ నియోజకవర్గ ప్రజలను వంచించే ప్రయత్నం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్నారని బుర్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్న రీతిలో మాట్లాడుతున్నారని, పీపీపీ పేరుతో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం సరైనదా అని ప్రశ్నించారు. ఒకపక్క నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన పోర్టును ప్రైవేట్‌పరం చేస్తుంటే ఎమ్మెల్యే తాడేపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రైవేట్‌కరణను స్వాగతించడం సిగ్గుచేటన్నారు. దీని వల్ల పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలతో పాటు, నిరుద్యోగ యువత ఆశలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేట్‌పరం చేయడం వల్ల స్థానిక నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇప్పటికై నా నిజాలు తెలుసుకుని ప్రజల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని హితవు పలికారు. పోర్టు ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడుతున్నామని, ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, జిల్లా సెక్రటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, జిల్లా ఇంటెలెక్చువల్ పోరం అధ్యక్షుడు రావులకొల్లు బ్రహ్మానందం, వలేటివారిపాలెం, ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం మండలాల అధ్యక్షులు అనుమోలు లక్ష్మీనరశింహం, నన్నం పోతురాజు, కాపులూరి క్రిష్ణ, నోటి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు నలమోతు చంద్రమౌళి, బద్దిపూడి జయరావు, వెలిచర్ల దనకోటేశ్వరరావు, పాలవల్లి అమర్నాధ్‌రెడ్డి, గేరా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


