‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగంతో చంద్రబాబు అరాచకం | - | Sakshi
Sakshi News home page

‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగంతో చంద్రబాబు అరాచకం

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

మార్కాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. సివిల్‌ వివాదంలో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అడ్డగోలుగా హత్యాయత్నం కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమన్నారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు పోలీసుల అక్రమ కేసుల కారణంగా అరెస్టయి, మార్కాపురం జిల్లా కోర్టుకు గురువారం రాత్రి హాజరైన బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ హనుమాన్‌ జంక్షన్‌ కుంట వద్ద 25 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 71 సెంట్ల స్థలంలో వైఎస్సార్‌సీపీ నేతలు దుద్దేల వెంకటరెడ్డి, భవనం వెంకటరెడ్డి తదితరులు గదులు నిర్మించారని పేర్కొన్నారు. ఇటీవల ఈ స్థలంపై దుగ్గెంపూడి పిచ్చిరెడ్డి అల్లుళ్లు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని, కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా ఖాతరు చేయకుండా ప్రత్యర్థులు నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోని పోలీసులు.. తమ సొంత స్థలంలోకి వెళ్లిన వెంకటరెడ్డి సహా 9 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ‘డ్రోన్‌ కెమెరాల విజువల్స్‌ చూసి హత్యాయత్నం కేసులు ఎలా పెడతారు? రెడ్‌బుక్‌ అమలు అంటే రక్తాన్ని పారించడమా? సివిల్‌ పంచాయతీలను పరిష్కరించేందుకు కోర్టులున్నాయి. కానీ లా అండ్‌ ఆర్డర్‌ను అధికార పార్టీ నాయకులు తమ సొంత అవసరాలకు వాడుకుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంది?’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ పోలీసులను నిలదీశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఒక ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడం వారి దమననీతికి నిదర్శనమన్నారు. ఈ వ్యవహారంలో ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, తప్పుడు కేసులు బనాయించిన అధికారులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్యాయంగా ప్రవర్తించిన అధికారులను న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దారవీడు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కృష్ణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సొంత స్థలంలోకి వెళ్తే వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నం కేసులా?

పోలీసుల తీరుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజం

అక్రమ కేసులపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement