టంగుటూరు: రాష్ట్రంలో కూటమి సర్కారు వివక్షాపూరిత పాలనకు ఈ ఘటనే సజీవ సాక్ష్యం. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి స్వామి స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో ఎస్సీ, ఎస్టీలు గుక్కెడు మంచినీటి కోసం అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ కాలనీలపై చిన్నచూపు చూస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దళితులు మండిపడుతున్నారు. మంత్రి స్వామి తన సొంత గృహానికి రామతీర్థం జలాశయం నుంచి ఏకంగా 4 అంగుళాల పైపుతో భారీ పైప్‌లైన్ వేయించుకుని జలకళ ఉట్టిపడేలా చేసుకున్నారు. కానీ, పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మాత్రం ఆరు నెలల క్రితం కేవలం పైపులు వేసి చేతులు దులుపుకొన్నారు. ఎప్పుడో అడపాదడపా మొక్కుబడిగా నీళ్లు వదులుతూ పక్షపాత బుద్ధిని చాటుకుంటున్నారు. మంత్రిగారి ఇంటికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? అని కాలనీవాసులు నిలదీస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము, చేతి చమురు వదిలించుకుంటూ ట్యాంకర్లతో నీరు కొనుక్కునే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరిచి తమ దాహార్తి తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.


