● డీఈఓకు ఎస్టీయూ నాయకుల వినతి
మార్కాపురం: జిల్లాలో జూన్ నెలలో బదిలీపై వచ్చిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతభత్యాల బిల్లులను ’నిధి’ యాప్‌లో వెంటనే ఎనేబుల్ చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎర్రయ్య కోరారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సామ సుబ్బారావుకు సంఘం నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రయ్య మాట్లాడుతూ.. బదిలీపై విధుల్లో చేరిన ఉపాధ్యాయుల బిల్లులు నిధి యాప్‌లో సమర్పించేందుకు వీలుకాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని, వారికి సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంటీఎస్ జిల్లా అధ్యక్షుడు వజ్రం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రామకోటేశ్వరరావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.


