కనిగిరి టుబాకో యార్డు పరిధిలో గత వారం రోజులుగా జరుగుతున్న వేలాన్ని పరిశీలిస్తే.. ప్రతి రోజు రైతులు తెచ్చిన సగం బేళ్లు నోబిడ్ పేరుతో తిరస్కరిస్తున్నారు. సోమవారం సీతారాంపురం క్లస్టర్ రైతులు 450 బేళ్లు తెస్తే.. కేవలం 220 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. దాదాపు 230 బేళ్లను వెనక్కి పంపారు. కొనుగోలు చేసిన చెక్కుల్లో కూడా 30 శాతం మాత్రమే గరిష్ట ధర వేయగా.. దాదాపు అన్నింటికీ కనిష్ట ధర రూ.160 ధర ఇచ్చారు. దీంతో పొగాకు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాస్తవానికి పశ్చిమ ప్రకాశంలో పొగాకు ఏ గ్రేడ్ పొగాకు ఉత్పత్తి 50 శాతం కూడా మించదు. మిగిలిన పొగాకు ఇతర గ్రేడ్‌లు వస్తాయి. గ్రేడ్ 2,3 రకాలకు రూ.160లు మించి ఇవ్వటం లేదు. దీంతో సగటు ధర రూ.200లోపు దిగజారింది. ప్రస్తుతం వస్తున్న ధరలతో బ్యారన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


