అద్దంకి రూరల్: ౖరెతులకు వ్యవసాయ కనెక్షన్‌లు ఇవ్వకుండా వారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం అని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా వారికి కనెక్షన్‌లు ఇవ్వకుండా మంత్రి నుంచి రికమండేషన్ లెటర్ తీసుకురావాలని విద్యుత్ శాఖ అధికారులు కోరటంతో రైతులు అశోక్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ అసలే వర్షాలు లేక ఇబ్బందులకు గురవుతున్న రైతులు విద్యుత్ కనెక్షన్‌లకు దరఖాస్తులు పెడితే మంత్రి అనుమతులు కావాలని అధికారులే చెప్పటం ఏంటని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం కూడా సంతమాగులూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామ రైతులు విద్యుత్ కనెక్షన్‌లు పెట్టుకుంటే కనెక్షన్‌లు ఇవ్వకపోవటంతో రైతులు కోర్టులో పిటిషన్ వేశారన్నారు. సంబంధిత అధికారులకు కనెక్షన్‌లు ఇవ్వండి అని కోర్టు ఆదేశించినా దానిని ధిక్కరించడంతో రైతులు మళ్లీ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు చీవాట్లు పెడితే అప్పుడు ఆ రైతులకు విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చారని గుర్తుచేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ మండలంలో రైతులకు 1200 విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చామని చెబుతున్నారని, ఇవి ఒక్క బల్లికురవ మండలానికేనా లేక అద్దంకి నియోజకవర్గం మొత్తానికా అని ప్రశ్నించారు. రైతులు కనెక్షన్‌లు పొందాలంటే టీడీపీ కార్యాలయాల చుట్టూ తిరగాలా లేక ఆ పార్టీలో చేరాలా అని ప్రశ్నించారు. గత 45 రోజుల నుంచి అద్దంకి మండలంలోని కలవకూరు రైతులను తిప్పుతూ అధికారుల ఇప్పుడు మంత్రి సిఫార్సు కావాలంటున్నారని, తాను స్వయంగా విద్యుత్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడితే తమకు రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయని అధికారులు తెలిపారన్నారు. సమస్యను మేము అడిగితే అధికారులను, రైతులను బెదిరించి గుండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. మీరు చేసే గుండాగిరికి బదులుగా తాము గాంధీగిరి చేస్తామన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే వైఎస్సార్‌సీపీ వారికి ఎలాంటి సహాయం చేయవద్దని చెప్పారన్నారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు, మతాలు, కులాలు చూడకండా అర్హతున్న వారికి అన్ని పథకాలు అందాయని చెప్పారు. రైతులకు విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుటే రైతులతో కలిసి గాంధీగిరి చేస్తామన్నారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి రైతులకు మేలు చేయాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఈదా శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రామకోటేశ్వరరావు, జ్యోతి రోశయ్య, మాజీ కౌన్సిలర్ బాలు, రైతులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు
అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్
చింతలపూడి అశోక్ కుమార్


