చీమకుర్తి: చేతికి అందొచ్చిన కొడుకు ప్రైవేట్ కంపెనీలో స్థిరపడ్డాడు అనుకునే తరుణంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే..చీమకుర్తి మండలం పల్లామల్లికి చెందిన వేలూరి శివసాయి పవన్(25) హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా 10 నెలలుగా పనిచేస్తున్నాడు. మరో రెండు నెలలు చేస్తే కంపెనీలో పర్మినెంట్ చేస్తామని ఇటీవలే కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు మృతుడి తండ్రి వేలూరు వేణుబాబు తెలిపారు. ఐటీఐ, డిగ్రీ చేసి ఎలక్ట్రీషియన్‌గా కంపెనీలో ఉన్న వందలాది మంది ఉద్యోగులలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న శివసాయి పవన్ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించటం కంపెనీలోని తోటి ఉద్యోగులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన కడుపులో ఇబ్బందిగా ఉందని, మెడికల్ షాపుకు వెళ్ళి ట్యాబ్‌లెట్లును తెచ్చుకుందామని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. బైకును నడుపుతున్న శివసాయి పవన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న కాకినాడకు చెందిన మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. శివసాయి పవన్ మృతదేహాన్ని మంగళవారం పల్లామల్లి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. కొడుకు కుటుంబానికి అండగా ఉండాటనుకుంటున్న తరుణంలో దూరం కావడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చాడం ఎవరి వల్లా కాలేదు.
బతుకుదెరువుకు వెళ్లి శవమై తిరిగొచ్చాడు
హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొని పల్లామల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ మృతి


