మద్దతు ధర రాక కుదేలవుతున్న పొగాకు రైతు ప్రభుత్వం సమీక్షలు చేస్తున్నా దిగజారిపోతున్న ధరలు పొగాకు రైతుకు న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తాం 16న కనిగిరిలో, 17న ఒంగోలులో నిరసన దీక్షలు పొగాకు రైతుల ఇబ్బందులు జగన్ దృష్టికి.. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులను గాలికొదిలేసిందని, మద్దతు ధర రాక రైతు కంట రక్త కన్నీరు కారుతోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్ని రకాల పంటలు సాగుచేసే లక్షలాది మంది రైతులు మద్దతు ధర లభించక అల్లాడుతున్నారన్నారు. ముఖ్యంగా పొగాకు రైతు మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. తాము పండించిన పంటను తగలబెట్టుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారులతో, కంపెనీలతో మాట్లాడుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు తప్ప రైతుల పక్షాన నిలబడడం లేదని ఆరోపించారు. కంపెనీలు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
పొగాకు రైతుకు మద్దతుగా ఆందోళనలు...
పొగాకు రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం ఆదుకోకుండా చోద్యం చూస్తోందని, దున్నపోతుపై వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తోందని బూచేపల్లి ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన నిలబడి పోరాడతామన్నారు. అందులో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో నిరసన దీక్షలు చేపడుతున్నామన్నారు. 16వ తేదీన కనిగిరిలో ఆర్టీఓ కార్యాలయం వద్ద, 17వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ దీక్షలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చి మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేసేంత వరకూ ఆందోళనలు చేస్తామన్నారు. గత సంవత్సరం కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పొదిలికి వచ్చి వెళ్లారని, ఫలితంగా కంపెనీలు పొగాకును కొనుగోలు చేశాయని గుర్తు చేశారు. రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఇటీవల ఒంగోలు కేంద్రంగా పార్టీలకతీతంగా జరిగిన ట్రాక్టర్ల ర్యాలీకి వేలాదిగా రైతులు తరలి వచ్చి నిరసన వ్యక్తం చేయడం మీకు కనబడడం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే పరిస్థితులు కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే మేలుకొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే సమీక్షలు చేస్తున్నారే తప్ప రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయండి..
వేలం కేంద్రాల్లో కంపెనీలు రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయకపోతే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి కొనుగోలు చేయాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 300 కోట్ల వరకూ వెచ్చించి పొగాకును కొనుగోలు చేసి మంచి ధర వచ్చాక అమ్మకాలు చేశామన్నారు. ఫలితంగా రైతులకు, ప్రభుత్వానికి మేలు జరిగిందని చెప్పారు. ఈ ఏడాది వేలం ప్రారంభమై 88 రోజులు కావస్తోందన్నారు. గతేడాది ఇదే సమయానికి సుమారుగా 75 మిలియన్ కేజీలు కొనుగోలు చేశారని, ప్రస్తుతం 35 మిలియన్ కేజీలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు రెండు సార్లు సమావేశాలు నిర్వహించి నోబిడ్ ఉండకూడదని చెప్పారని, అయినా ఎలాంటి ఉపయోగం లేదని బూచేపల్లి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించేలా దృష్టి పెడుతున్నారే తప్ప రైతులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. మద్దతు ధరల కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన రైతులు ఉన్నారని, ఇటీవల ఒంగోలులో జరిగిన ర్యాలీలో మీ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారన్‌కు రూ.3 లక్షల వరకూ రైతులు నష్టపోతున్నారన్నారు. మా ప్రభుత్వ హయాంలో కేజీ రూ.320కి పైగా కొనుగోలు చేశారని, ప్రస్తుతం రూ.200లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని, ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చి ఉద్యమం చేస్తామన్నారు.
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందన్నారు. నెలకు రూ.15 వేల కోట్లకు పైగా అప్పు చేస్తున్న ప్రభుత్వం ఒక్క రోజు అప్పు రూ.500 కోట్లు ఇచ్చి మార్కెట్‌లో పోటీ తెస్తే పొగాకుకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించకుండా, కంపెనీల వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చాం.. కొనకపోతే నీ సంగతి తెలుస్తాం అని మాట్లాడటం తప్ప రైతులకు న్యాయం చేయటం లేదని విమర్శించారు. వార్నింగ్ ఇస్తే ఎవరు రిస్క్ తీసుకుంటారనీ, ప్రైవేటు వ్యక్తులపై ఇతనికి ఏం అధికారం ఉంటుందని విమర్శించారు. అనంతరం పొగాకు రైతు దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కనిగిరి జెడ్పీటీసీ కస్తూరిరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


