ఒంగోలు సబర్బన్: కలెక్టరేట్లో బుధవారం నిర్వహించే డీఆర్‌సీ సమావేశానికి సంబంధించి అధికారులందరూ సరైన నివేదికలతో హాజరు కావాలని, సమాధానాలు చెప్పటానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్న డీఆర్సీ మీటింగ్‌పై సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నవంబర్– 2025న జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు, అన్నదాత సుఖీభవ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర అంశాలను ప్రజా ప్రతినిధులు లేవనెత్తే అవకాశం ఉన్నందున విషయాలను వివరించేలా సంబంధిత అధికారులు ఉండాలన్నారు. సమస్యలను సమగ్రంగా వివరించాలని, అంతేకాకుండా ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


