మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: మీకోసం అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజా బాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్‌ఓ పి.వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డీపీఓ అనుపమ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిరంజీవి ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 261 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కింద స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మీకోసం అర్జీలకు పరిష్కారం, ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్‌లో సానుకూల ప్రజాభిప్రాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో మరింత చురుకుగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. మీకోసం అర్జీలకు సకాలంలో సహేతుక పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్నాళ్లీ అప్పుల బతుకులు
● ఏడాది నుంచి పెండింగ్ జీతాలు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి
కురిచేడు: స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులకు ఏడాది నుండి జీతాలు చెల్లించకపోవటంతో అప్పులు ఇచ్చేవారు లేక, తమ కుటుంబాలను పోషించుకోలేక వేరే పనులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరి సారిగా కలెక్టర్ రాజాబాబుకు తమ గోడు వినిపించుకునేందుకు సోమవారం కార్మికులందరూ చలో కలెక్టర్ కార్యాలయం అంటూ బయలు దేరి వెళ్లారు. గ్రామంలో ఒక్కరోజు చెత్త తీయకపోతే ఎక్కడ చెత్త అక్కడ పేరుకుని దుర్గంధం వెదజల్లుతూ గ్రామం అంతా చెత్తమయమైంది. గతంలో కూడా చాలాసార్లు పంచాయతీ కార్మికులు సమ్మె చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి వేతనాలు వెంటనే ఇచ్చి గ్రామంలో చెత్తపేరుకుపోకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడండి
● గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు భూముల్లో చేపల చెరువులు
● కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన మండలంలోని ధేనువకొండ గ్రామస్తులు
అద్దంకి: గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు భూముల్లో చేపల చెరువులను వేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సోమవారం ఒంగోలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన గోకతోటి గోపీకృష్ణ, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, సింగంపల్లి రాజుతోపాటు మరో 50 మంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఽమోదేపల్లి గ్రామ రెవెన్యూలో 251,252,253,149, 250 సర్వే నంబర్లలోని భూమి గుండ్లకమ్మ ప్రాజెక్టులో ముంపులో పోగా, ఆయా భూముల రైతులకు పరిహారం ఇచ్చారు. అయితే కొందరు అక్రమార్కులు ఆభూముల్లో చేపల చెరువులను తవ్వుతున్నారని చెప్పారు. సుమారు 100 ఎకరాల్లో చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేస్తున్నారన్నారు. చేపల చెరువుల నిర్మాణం వలన మాపట్టా భూముల నుంచి వర్షపు నీరు నదిలోకి వెళ్లకుండా ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున చేపల చెరువుల నిర్మాణాలను అధికారులు అడ్డుకోవాలని విన్నవించారు. చెరువుల నుంచి విడిచిన కలుషిత నీటి వలన తమ గేదెలు రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరారు.


