అధికారులకు కలెక్టర్ విజయ సునీత ఆదేశం
మార్కాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి పనిచేయాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 238 అర్జీలురాగా, వీటిలో రెవెన్యూకు సంబంధించి 150, ఇతర సమస్యలపై 88 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.విజయ సునీత మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరిగా దృష్టి సారించడం లేదని, ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, కంభం ఎస్‌డీసీ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి అధికారి బాలాజీ నాయక్, డీఎంహెచ్‌వో వాణిశ్రీ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఖరీం, లీడ్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తమ్ముడి ఆచూకీ తెలపండి:
సుమారు రూ.50 నుంచి రూ.60 లక్షల మేర ఇచ్చి సొంత తమ్ముడు బుర్ర ప్రసాద్ రెడ్డి చేతిలో ఘోరంగా మోసపోయానని అంజలి ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి బాగా సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటానని నమ్మించి మోసం చేసి పత్తా లేకుండా పారిపోయాడన్నారు. గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందన ద్వారా అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన అంజలి చేసిన అప్పులకు వడ్డీలకు కట్టలేక అల్లాడుతున్నానని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకుంది. తమ్ముడి ఆచూకీ తెలపాలని వేడుకుంది.
మెస్‌చార్జీలు పెంచాలని కలెక్టర్‌కు వినతి
ప్రభుత్వం హాస్టళ్ల మెస్ చార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్ల మెస్ బిల్లు విషయంలో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కురిపిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కొమ్ము విజయ్ అన్నారు. ఇప్పటికే రూ.1600 ఉన్న మెస్ బిల్లుకి 10 శాతం పెంచారు, అంటే ఒక విద్యార్థికి రూ.160 మాత్రమే పెంచారన్నారు. వసతి గృహాల మెనూ చార్ట్ మాత్రం కనువిందుగా ఉందని, కానీ అమలు చేయడంలో లోపం జరుగుతోందన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు వందన్ కుమార్, పట్టణ నాయకులు రాము, తరుణ్ పాల్గొన్నారు.


