వరిసాగుకు నీళ్లొదలండి | - | Sakshi
Sakshi News home page

వరిసాగుకు నీళ్లొదలండి

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

కంభం: ‘అదును దాటి పోతుంది వరి సాగుకు చెరువు నీళ్లు వదలండి’ అంటూ సోమవారం కంభం చెరువు ఆయకట్టు రైతులు స్థానిక ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇరిగేషన్‌ డీఈ సీహెచ్‌ రామారావు, ఏఈ శ్రీనివాస నాయక్‌ను చుట్టుముట్టిన రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకునేందుకు అదును దాటిపోతుందని, ఇప్పటి వరకు తూములు ఎత్తకుంటే వరి నాట్లు ఎప్పుడు వేసుకోవాలని ప్రశ్నించారు. పదిహేను రోజులుగా రైతులు ఇరిగేషన్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించకుండా అదును దాటిన తర్వాత నీళ్లొదినా ఫలితం లేదని, దిగుబడులు రావని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంభం, పోరుమామిళ్లపల్లి, చిన్నకంభం, నల్లకాల్వ, హజరత్‌గూడెం, రావిపాడు, దరగా, ఔరంగబాదు, తదితర గ్రామాల రైతులు ఈ ఖరీఫ్‌కు వరి వేసేందుకు ఇప్పటికే వరి విత్తనాలు తెచ్చుకొని నారుమడులు తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని అధికారులకు తెలిపారు. కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి సిబ్బందితో కలసి ఇరిగేషన్‌ కార్యాలయం వద్దకు చేరుకొని రైతులు, అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. డీఈ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆయకట్టుకు దూరంగా ఉన్న గ్రామాల పొలాలకు నీరందించలేమని తెలిపారు. కార్యక్రమంలో కంభం చెరువు అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పార్శ ఆదయ్య, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement