ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కమిటీ డిమాండ్
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక రెవెన్యూ భవన్‌లో జేఏసీ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంతో నిర్వహించనున్న చర్యల్లో ఉద్యోగుల కోర్కెలు తీరాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీజేఏసీ అమరావతి 21 డిమాండ్లతో పోరాటం చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. ప్రభుత్వం చర్చల కోసం మంత్రుల కమిటీని నియమించింది. ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వంతో సచివాలయంలో చర్చించింది. సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ తదితర ప్రధానమైన 21 డిమాండ్లను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ ఎస్.పోలయ్య, మహిళా వింగ్ జనరల్ సెక్రెటరీ సీహెచ్.శ్రీదేవి, విజయ లక్ష్మి, హసీనా, ఒంగోలు డివిజన్ అధ్యక్షుడు బి.సత్యసాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


