మార్కాపురం: ప్రజల నుంచే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జవాబుదారీగా ఉండాలని ఓఎస్‌డీ నవజ్యోతి మిశ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ మీకోసం నిర్వహించారు. అందిన ఫిర్యాదులపై పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి తక్షణం విచారించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్‌స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, సబ్ డివిజన్లో కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, ఉద్యోగాల పేరుతో మోసం, వేధింపులు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. డీఎస్పీ నాగరాజు, సీఐలు అల్తాఫ్ హుస్సేన్, వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: గుండెపోటుతో అసిస్టెంట్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..నల్లగుంట్లకు చెందిన మోహన్‌బాబు అసిస్టెంట్ ఫారెస్టు బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నల్లగుంట్ల బీట్ పరిధిలో తాను ఎక్కడెక్కడ విధులు నిర్వహించిన సమాచారాన్ని ఫారెస్టు గ్రూపులో అధికారులకు తెలియపరిచాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మోహన్‌బాబు మృతిపై ఫారెస్టు అధికారులు తీవ్ర వ్యక్తం చేశారు.
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర సమాచార శాఖ (ఆర్‌టీఐ) కమిషనర్ డాక్టర్ చావలి సునీల్ సోమవారం జిల్లాలో పర్యటించారు. తొలుత ఒంగోలులోని ప్రకాశం భవనంలో కలెక్టర్ పి.రాజాబాబును కలిశారు. అనంతరం స్థానిక జీజీహెచ్, మున్సిపల్ కార్యాలయం, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్లను సందర్శించారు. ఆయా కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అమలవుతున్న తీరును పరిశీలించారు. సమాచార హక్కు విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు, సమాచార అధికారుల పేర్లు ప్రదర్శించాలని సూచించారు.


