ఒంగోలు టౌన్: కేంద్రంలోని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అసంతృప్తికి గురైన ప్రజలను, ప్రతిపక్ష పార్టీల అనుకూల ఓటర్లను తొలగించడానికే సర్ ప్రక్రియను చేపట్టారని మేలుకో ఆంధ్రప్రదేశ్ సంస్థ రాష్ట్ర కో కన్వీనర్ షేక్ సుభాన్ అన్నారు. దేశంలో 1952 నుంచి ఓట్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ జరుగుతున్నా నేడు మోదీ పాలనలో చేస్తున్న సర్ ప్రక్రియలో ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మాదాల నారాయణ స్వామి భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్ భారతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 52 శాతం సర్ ప్రక్రియ పరిశీలన పూర్తయిందని, రేపు గడువు ముగిసే సమయానికి మిగిలిన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో ఆలోచించుకోవాలని చెప్పారు. సర్ ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరారు. ప్రగతిశీల మహిళాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ ఓటు హక్కుకు పౌరసత్వానికి మధ్య సంబంధం తీసుకొని రావడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. వలసలు, గిరిజనులు, మహిళలు, ముస్లింలు సర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మన దేశంలో 6.23 కోట్లను తొలగించారని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు సీఎస్ సాగర్, సూర్య కుమారి, కృష్ణారావు, రావులపల్లి లక్ష్మి, ఆర్.మోహన్, సుశీల, సీతారావమ్మ, సుజాత, అమ్మాజీ, హనుమంతరావు, దారా సుబ్బారావు, ఎల్.రాజశేఖర్, వైవీ కృష్ణారావు పాల్గొన్నారు.
● డీఈఓ సీవీ రేణుక
ఒంగోలు సిటీ: ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక సూచించారు. నగరంలోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లకు సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగోన్నతి అవకాశాలు కల్పించడంలో ఓపెన్ స్కూల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లను పెంచేందుకు కోఆర్డినేటర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. స్టడీ సెంటర్ల నిర్వహణ, పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (పీసీపీ) తరగతుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.


