● కలెక్టర్ విజయసునీత
మార్కాపురం: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో సోమవారం జేసీతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్(ఏపీ ఎయిమ్స్)యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి రైతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమకు కావాల్సిన ఎరువులను తెచ్చుకోవచ్చాన్నారు. వ్యాపారులు ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను పక్కదారి పట్టించినా, వివిధ రకాల ఎరువులను కచ్చితంగా కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వలన రైతులు విచక్షాణ రహితంగా ఎరువులు వాడటం, బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందన్నారు. యూరియా, డీఎపీ తదితర ఎరువులు అన్నికూడా యప్ ద్వారా ఆర్‌ఎస్‌కేలు, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇప్పటి వరకు 1.17లక్షల మంది రైతులు యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభవుతుందని చెప్పారు. దీంతో ఎరువులను కొద్ది మంది రైతులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. యూరియా 12,779 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా జిల్లాలో 120 టన్నుల యూరియా, 300 టన్నుల డీఏపీ మాత్రమే రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎరువుల అమ్మకాలపై టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేస్తున్నామని, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెస్తున్నామని, ఏ డీలర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 650 హెక్టార్‌లలో పత్తి సాగు చేశారని, వర్షాలు పడితే కంది, ఇతరత్రా పంటలు సాగవుతాయన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎరువుల అమ్మకాలపై మార్కాపురంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఏఓ బాలాజీ నాయక్ పాల్గొన్నారు.


