● బేరింగ్ విరగడంతో ఊడిపోయిన టైర్
● సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
మార్కాపురం రూరల్: మండలంలోని దరిమడుగు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద శనివారం మాచర్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తున్న సమయంలో బస్సు బేరింగ్ విరగడంతో ఒక టైర్ ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అనంతరం ఆర్టీసీ అధికారులు మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించారు.
కాపర్ వైర్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
● 400 కిలోల కాపర్ వైర్ స్వాధీనం
చీమకుర్తి రూరల్: ట్రాన్స్‌ఫార్మర్లలో కారప్ వైర్లు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చీమకుర్తి, సంతనూతలపాడు, తాళ్లూరు, ముండ్లమూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో రాత్రిళ్లు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్లను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సీఐ దుర్గాప్రసాద్ అరెస్ట్ చేశారు. నిందితులు పొలా నెహెమియా, గురునాథం రత్న కుమార్, పోలా రాజేష్, నాగులూరి మరియబాబు, పొగడ్త నాంచారయ్యలను ఈ నెల 11వ తేదీ ఎర్రగుడిపాడు రోడ్డులో చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 400 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
యర్రగొండపాలెం: మండలంలోని మెట్టబోడు తండా వద్ద స్కూటీని వెనుక వైపు నుంచి కారు ఢీకొన్న సంఘటనలో బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..రియాన్(5) తన తండ్రి రత్నరాజుతో స్కూటీపై పిల్లికుంట తండాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో టోల్‌గేట్‌కు సమీపంలో హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తున్న కారు అతివేగంగా వెనక నుంచి ఢీకొట్టడంతో తండ్రి కుమారుడు రోడ్డుపై కిందపడ్డారు. తండ్రి రత్నరాజు తీవ్రంగా గాయపడగా రియాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రత్నరాజును 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ఆయన భార్య హెల్త్ కమ్యూనిటీ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తుంది. మెట్టబోడు తండాలో ఒకరి ఆరోగ్యం బాగలేదని సమాచారం రావడంతో ఆయనకు మందులు ఇచ్చిరమ్మని భర్త రత్నరాజుకు చెప్పింది. తండ్రితో పాటు బాలుడు స్కూటీపై వెళ్లి మృత్యువడిలోకి చేరాడు. కాగా స్కూటీని ఢీకొన్న కారు సంఘటన స్థలంలో నిలిపి క్షతగాత్రులను వైద్యశాలలో చేర్పించే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. సంఘటన తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ టీం ఆ కారును వెంబడించి యర్రగొండపాలెంలో నిలిపి కారు డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పచెప్పారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు.
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): మండలంలోని మిట్టపాలెంకు సమీపంలో రైతు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పుల్లలచెరువు మండలంలోని కవలకుంట్ల గ్రామానికి చెందిన నారు వెంకటరామిరెడ్డి(35) అనే రైతు తన భార్య స్వగ్రామమైన త్రిపురాంతకం మండలంలోని రామసముద్రం వద్ద పొలం కౌలుకు తీసుకొని అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రామిరెడ్డి మిట్టపాలెం శివారు ప్రాంతంలో శవమై కనిపించాడు. తన ద్విచక్రవాహనం అక్కడే ఉండటంతో పాటు అతని ముఖంపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. రామిరెడ్డిని ఎవరైనా హతమార్చి ఉంటారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం క్లూస్ టీంను పిలిపించి ముమ్మరంగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు.


