పామూరు: విద్యుదాఘాతంతో బేల్దారీ మేస్త్రి మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని మార్కొండాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కట్టా అనూక్ తెలిపిన వివరాల ప్రకారం... మార్కొండాపురం గ్రామానికి చెందిన దగ్గుపాటి పెద్ద వెంగయ్య తన భార్య దగ్గుపాటి రాములమ్మ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నెల్లూరు జిల్లా నర్రవాడలో జరుగుతున్న వెంగమాంబ తిరునాళ్లకు వెళ్లేందుకు నిజామాబాద్ నుంచి మూడు రోజుల క్రితం మార్కొండాపురం వచ్చారు. తిరునాళ్ల చూసుకుని మార్కొండాపురంలోని ఇంట్లో ఉండగా, శనివారం ఉదయం దగ్గుపాటి రాములమ్మ ఇంటిని శుభ్రం చేసే క్రమంలో పైప్‌తో నీరుకొట్టి చీపురుతో చిమ్ముతోంది. టీవీ దగ్గర నీటితో తుడుస్తూ టీవీ పక్కనున్న ప్లగ్‌బాక్సు తీసే క్రమంలో ఆమె ఎడమచేతి కి కరెంట్‌షాక్ తగిలి కిందపడి గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న ఆమె భర్త దగ్గుపాటి పెద్ద వెంగయ్య హుటాహుటిన ఇంట్లోకి వచ్చి ప్లగ్ బాక్స్ పట్టుకోబోగా.. నాకు షాక్ తగిలింది.. నువ్వు జాగ్రత్త అని రాములమ్మ చెప్పింది. పెద్ద వెంగయ్య జాగ్రత్తగా ప్లగ్‌బాక్స్ తీసి పక్కకు పెట్టే క్రమంలో అతని ఎడమచేతికి విద్యుత్‌షాక్ తగిలి కిందపడి పోయి కేకలు వేశాడు. రాములమ్మ, ఆమె అత్త, సమీపంలో నివాసం ఉంటున్న తుపాకుల నాగార్జున మరికొంతమంది వచ్చి కర్రతో వైర్లు పక్కకు తీసి వైద్యం కోసం కనిగిరి వైద్యశాలకు తరలించగా, దగ్గుపాటి పెద్ద వెంగయ్య (45)ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఆ మేరకు రాములమ్మ ఫిర్యాదు ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త ఆకస్మిక మృతితో భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


