సాక్షి టాస్క్‌ఫోర్స్:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతుండగా.. మందుబాబులు రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన ఒంగోలు, మార్కాపురంతోపాటు మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వందలాది మద్యం దుకాణాలు కోడి కూయక ముందే తెరుచుకుంటున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే మద్యం అమ్మాలన్న రూల్స్‌ను అధికార పార్టీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. రాత్రి 11 దాటినా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు, బార్లు ఏర్పాటు చేయడం, అడ్డగోలుగా బెల్టు షాపులు నిర్వహిస్తుండటంతో తాగిన మత్తులో కొందరు ప్రధాన రహదారులపైనే పడిపోతున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మార్కాపురం దోర్నాల బస్టాండ్ వద్ద ఓ మందుబాబు ఏకంగా ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌ను స్తంభింపజేశాడు. ఇక ముండ్లమూరు మండలం ఈదరలో నిబంధనలు పూర్తిగా గాలికొదిలారు. టీ కొట్ల కన్నా ముందే మద్యం షాపు షట్టర్లు తెరిచారు. ఒంగోలు మంగమూరు రోడ్డు సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన బార్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా తెరిచే ఉండటం పోలీసులు, ఎకై ్సజ్ అధికారుల తీరును తేటతెల్లం చేస్తోంది.
ఉదయం 6 గంటలకే తెరుచుకుంటున్న వైన్ షాపులు
రోడ్లపైనే తాగుబోతుల న్యూసెన్స్.. ట్రాఫిక్‌కు ఆటంకం
చోద్యం చూస్తున్న ఎకై ్సజ్, పోలీసు అధికారులు


